16, అక్టోబర్ 2017, సోమవారం

Potireddipadu పోతిరెడ్డిపాడు

Potireddipadu పోతిరెడ్డిపాడు
నోముల ప్రభాకర్ గౌడ్

పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ తప్పుల కుప్ప
-తేలని వరద లెక్కలు.. 2,500 నుంచి 3 వేల క్యూసెక్కుల తేడా
-రెండుసార్లు బోర్డు ఇంజినీర్ల్ల పరిశీలనలో కొలిక్కిరాని లెక్కలు
-పాత గేట్లను మూసేయాలని కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ సర్కారు భారీఎత్తున అక్రమంగా తరలించుకుపోతున్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద ఏర్పాటుచేసిన టెలిమెట్రీ లెక్కలు తేల్చలేకపోతున్నది. ఆ ఒక్క పరికరంతో నదిలాంటి పోతిరెడ్డిపాడు ప్రవాహాన్ని లెక్కించడం సాధ్యం కావటంలేదని తేలింది. పోతిరెడ్డిపాడు దిగువన 12.265 కిలోమీటర్ వద్ద ఏర్పాటు చేసిన సెన్సర్ల ద్వారా నమోదవుతున్న డిశ్చార్జికి, వాస్తవ డిశ్చార్జికి పొంతన లేదని బోర్డు ఇంజినీర్ల బృందం ఈనెల 4-6 తేదీల్లో పర్యటించి తేల్చింది. గురు, శుక్రవారాల్లో మరో బృందం పర్యటించింది. ఏడీసీపీ(అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) ద్వారా డిశ్చార్జికి, సెన్సర్ల ద్వారా నమోదవుతున్న డిశ్చార్జికి పొంతన కుదురడంలేదని మళ్లీ తేల్చింది. ఏడీసీపీ ద్వారా సుమారు 2,500 నుంచి 3,000 వేల క్యూసెక్కుల డిశ్చార్జి నమోదవుతుండగా, తక్కువ డిశ్చార్జిని ఆంధ్రప్రదేశ్ అధికారులు రిజిస్టర్‌లో నమోదుచేస్తున్నారు. దీంతో కృష్ణాజలాలు అక్రమంగా శ్రీశైలం నుంచి కృష్ణా అవతలిబేసిన్‌కు తరలిపోతున్నాయి. వాస్తవంగా పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే 12వేలపైచిలుకు క్యూసెక్కుల డిశ్చార్జిని లెక్కించే సామర్థ్యం అక్కడ ఏర్పాటుచేసిన సెన్సర్లకు లేదని, మరోవైపు ఒక్కచోటనే టెలిమెట్రీ ఏర్పాటుచేస్తే పోతిరెడ్డిపాడు పూర్తి డిశ్చార్జిని గుర్తించడం సాధ్యంకాదని ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. బనకచర్ల వద్ద పోతిరెడ్డిపాడు కాల్వ మూడుపాయలుగా విడిపోతున్నది. ఈ మూడు మార్గాల్లో ఒక్కోటి, పోతిరెడ్డిపాడు 600 మీటర్ల దగ్గర మరో టెలిమెట్రీ ఏర్పాటుచేస్తే తప్ప లెక్కలు తేలవని స్పష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక బోర్డు ఇంజినీర్లు కొందరు తలపట్టుకోగా, ఆంధ్రప్రదేశ్ ఆశించిందే నెరవేరిందంటూ బోర్డులోని కొందరు సూత్రధారులు సంబురపడుతున్నారు.
ఒప్పందం అమలుచేయరేం?
టెలిమెట్రీ గందరగోళంపై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు లేఖ రాశారు. డిశ్చార్జిలో తేడాలను బోర్డు ఇంజినీర్లు గుర్తించినందున వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. టెలిమెట్రీ ఏర్పాటుచేసిన వారంరోజుల్లోనే వినియోగంలోకి తేవాలని మెకట్రానిక్స్ కంపెనీతో బోర్డు చేసుకున్న ఒప్పందంలో ఉన్నదని గుర్తుచేశారు. గత నెల 22న బోర్డు వెబ్‌సైట్‌లో లెక్కలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, అధికారికంగా వినియోగంలోకి ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. గత నెల 19న పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల మొదలైనప్పటి నుంచి రోజువారీ డిశ్చార్జి లెక్కలు తీయాలి. వాస్తవ డిశ్చార్జికి అనుగుణంగా టెలిమెట్రీ పరికరాన్ని అమర్చాలి. పోతిరెడ్డిపాడు పాతగేట్ల నుంచి భారీగా లీకేజీ అవుతున్నందున, ఆ షట్టర్లను మూసివేయాలి అని లేఖలో డిమాండ్ చేశారు. టెలిమెట్రీ ఏర్పాటుచేసిన మెకట్రానిక్స్ కంపెనీ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో బ్లాక్‌లిస్టులో పెట్టాలని బోర్డును గతంలోనే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌చేసిన విషయం తెలిసిందే. అయినప్ప టికీ చర్యలు తీసుకోని బోర్డు గత సభ్య కార్యదర్శి సమీర్‌ఛటర్జీ, ఆ కంపెనీకి తుదిబిల్లులు చెల్లించాలని రెండు రాష్ర్టాల నీటిపారుదలశాఖకు లేఖలు రాయడం గమనార్హం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి