17, నవంబర్ 2017, శుక్రవారం

Ayurveda ఆయుర్వేదం

Ayurveda ఆయుర్వేదం ...joke

ఆయుర్వేదంలో ఇన్ని అద్భుతాలు వున్నాయా?  ఏకంగా కనపడకుండా పోవచ్చా?  
వస్తుగుణదీపిక పుస్తకం తిరగేస్తుంటే.. నల్లగుంటగలగర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
గుంటగలగర ఆకు గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆకును కొబ్బరినూనెలో మరిగించి తలకు రాసుకుంటారు. అలాగే ఈ ఆకుతో రోటిపచ్చడి కూడా చేసుకోవచ్చు. భృంగరాజ్ తైలం అని మార్కెట్లో కూడా దొరుకుతుంది.
గుంటగలగరకు అనేక ఔషధ గుణాలు వున్నాయి. అందులో సందేహం లేదు.
నల్లగుంటగలగర విశేషాలను ఇప్పుడు చెప్పుకుందాం.
చిత్రంలో వున్నది మామూలు గుంటగలగర. కృష్ణగుంటగలగర పువ్వులు నీలం రంగులో వుంటాయి.
నల్లగుంటగలగర మొక్క మొత్తాన్ని నీడలో ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత చూర్ణం చేసి, ప్రతిరోజు ఉదయం సుమారు బేడయెత్తు చూర్ణాన్ని ఆవు పెరుగుతో కలిపి ఒక సంవత్సరం పాటు పుచ్చుకోవాలి.
పాటించాల్సిన నియమాలు:
ఈ సంవత్సర కాలములో నియమనిష్టలతో వుండాలి. లఘువైన శాకాహారాలను భుజించాలి. పులుపు, కారాలను తగ్గించాలి. స్నాన, పాన, భోజన శయనాదులలో నియమం కలిగి వుండాలి. లైంగిక సంభోగములు వుండరాదు.
ఏడాదికాలంలో చేకూరే ఫలితాలు:
1. మొదటి నెలలో సమస్త రోగములు నివారణ అగును 
2. రెండవ నెలలో తెల్లని వెంట్రుకలు నల్లబడును 
3. మూడవ నెలలో బుద్ధికి బలము కలుగును 
4. నాలుగవ నెలలో మనని చూసి శత్రువులు భయపడుదురు 
5. ఐదవ నెలలో మనను అందరూ మర్యాద చేయుదురు 
6. ఆరవ నెలలో మనకు ఐశ్వర్యం కలుగును 
7. ఏడవ నెలలో మన దేహకాంతి భేదించును 
8. ఎనిమిదో నెలలో గొప్పవాళ్లం అవుతాం 
9. తొమ్మిదో నెలలో మనం ఒక్కోసారి కనిపిస్తాం.. ఒక్కోసారి కనిపించం  
10. పదవ నెలలో మననెవ్వరూ కనుగొనజాలరు     (ఎవరన్నా కాలింగ్ బెల్ కొడితే తలుపు తీస్తాంకానీ.. వచ్చిన వాళ్లకు మనం కనపడం అన్నమాట. అప్పులవాళ్లు చెప్పులరిగేలా తిరుగుతుంటారు మన జాడకోసం. పోలీసులు సీసీటీవీ ఫుటేజులను తెగ వెదుకుతారు మన అజాపజాకోసం. )
11. పదకొండవ నెలలో మహా శూరులం అవుతాం 
12. పన్నెండవ నెలలో మహాత్ములం అవుతాం 
..
ఈ సంగతి తెలియగానే.. బాబ్బాబు అదెక్కడ దొరుకుతుందో కాస్త తెచ్చిపెట్టు. ఏడాదిపాటు పాటిస్తాను. నీతో.. ఈ కుక్కలు, పిల్లులు, కోళ్లతో వేగలేకపోతున్నాను. ఎవరికీ కనిపించకుడా మాయమైపోతాను అన్న. మనుషులకు కనబడవేమో కానీ.. కుక్కలు, పిల్లులు, కోళ్లకు కనిపిస్తావేమో అని డౌటనుమానం ఎక్స్ ప్రెస్ చేశాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి