7, నవంబర్ 2017, మంగళవారం

Elections ఎన్నికలు

Elections ఎన్నికలు

2019 వచ్చే అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికలు రాయలసీమ వాసులకు కొత్త ముఖాలను పరిచయం చేయనున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటున్న వారితోపాటు వారి వారసులు, కుటుంబ సభ్యులు బరిలోకి దిగడమే కాదు.. కొందరు వెనక్కు తగ్గి మరి కొందరు ముందుకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్థల మార్పును కోరుకుంటున్నారని వినికిడి. ముందుగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చేసి తర్వాత కొడుకు నారా లోకేశ్‌ను తన క్యాబినెట్ లోకి తీసుకున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాల్సిన అవసరం ఉన్నది. పలు నియోజకవర్గాలను పరిశీలనలోకి తీసుకున్నా సొంత సామాజిక వర్గం జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాలను బాబు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం. అలా కానీ పక్షంలో కుప్పుం నుంచే నారా లోకేశ్‌ను రంగంలోకి దించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సొంత చిత్తూరు జిల్లాలోని సురక్షిత స్థానం 'కుప్పం' వదిలేయడం వల్ల తనయుడు లోకేశ్.. సేఫ్ జోన్‌లో చంద్రబాబు తలపోస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. సీఎంగా చంద్రబాబు తాను కొత్త అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సంకల్పించారని వార్తలొచ్చాయి. ప్రత్యేకించి కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట గట్టిగా వినిపిస్తున్నది. ఇక ఆయన వియ్యంకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలక్రుష్ణ ఈ దఫా.. హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబుకు ప్రత్యామ్నాయ సీటు నంద్యాల
దీని ప్రకారం నంద్యాల అసెంబ్లీ స్థానం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూమా కుటుంబ సభ్యులకు దక్కే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. తనయుడు లోకేశ్‌కు కుప్పం.. సేఫ్‌గా ఉంటుందని, తన కోసం నంద్యాల సీటును ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని వినికిడి. ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందే సరికి చంద్రబాబు లెక్కలు, అంచనాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే చంద్రబాబు ఇప్పుడు మదిలో తలెత్తిన వ్యూహానికి కట్టుబడి ఉంటాడా? లేదా? అన్న విషయం వేచి చూస్తే గానీ అర్థం కానీ అంశం.
నల్లారి కిరణ్ కుమార్ రాజకీయ భవితవ్యం ఆసక్తికరమే
కర్నూల్ ఎంపీ సీటు నుంచి కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పడుతారని వినికిడి. ఇక నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని పోటీలోకి దించుతారన్న విషయం ఇంకా స్పష్టత రానే లేదు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరాగమనం సంకేతాలిస్తున్నారు. ఇప్పటికిప్పుడైతే ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు గానీ.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆసక్తికర పరిణామమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు
కడప నుంచి అవినాశ్ సస్పెన్స్.. షర్మిలకు చాన్స్?
చిత్తూరు జిల్లాతోపాటు కడపకు అనుసంధానమైన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎంపీ మిధున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి పోటీ చేసి.. కొడుకుని అసెంబ్లీకి పంపాలని యోచిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇక కడప లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తారా? అన్నది అనుమానమే. వైఎస్ షర్మిల, వైఎస్ భారతిల్లో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిలను ఒంగోలు నుంచి గానీ, విశాఖపట్నం నుంచి గానీ పోటీ చేయించే చాన్స్ కనిపిస్తున్నది.
పోటీ చేయనన్న జేసీ.. కొడుక్కి చాన్స్ లభిస్తుందా?
అనంతపురం జిల్లాలోని రెండు లోక్‌సభా స్థానాల పరిధిలో మార్పులు జరిగే అవకాశాలు పుష్కలం. అనంతపురం స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. ఇక ఆయన తన తనయుడ్ని పోటీలోకి దించాలని భావించినా సీఎం చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్నది అనుమానమే. అందునా జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు రాజకీయ అవసరాలేమీ లేవు. ఈ నేపథ్యంలో వారిని పూర్తిగా పక్కన బెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అనంతపురం లోక్ సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరన్న విషయం స్పష్టత రావాల్సి ఉన్నది. అలాగే హిందూపురం స్థానం నుంచి కూడా కీలక మార్పులు జరుగవచ్చునని భావిస్తున్నారు.
వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి?
ప్రస్తుత ఎంపీ నిమ్మల కిష్టప్ప తన స్థానాన్ని బాలక్రుష్ణ కోసం త్యాగం చేసేందుకు సిద్దంగా ఉన్నారట. బాలక్రుష్ణ హిందూపురం లోక్ సభ స్థానానికి పోటీ చేస్తే, అసెంబ్లీ స్థానానికి నారా వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు.. నారా లోకేశ్ గానీ, ఆయన భార్య బ్రాహ్మణి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్ పోటీ చేయడం కుదరకపోతే బాలక్రుష్ణ తన అల్లుడి కోసం సీటు త్యాగం చేసి.. లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారని వినికిడి. అయితే దగ్గుబాటి పురందేశ్వరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని హిందూపురం లోక్ సభ సీటు కేటాయించాలని వైఎస్ జగన్ తలపోస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథరెడ్డికి వచ్చే అసెంబ్లీ టిక్కెట్ లభించడం సందేహస్పదమేనని అంటున్నారు. పల్లె రఘునాథరెడ్డి ప్రాతినిధ్యం వహించిన పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎంపీ నిమ్మల కిష్టప్ప తన తనయుడిని రంగంలోకి దించాలని యోచిస్తున్నారని వినికిడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి