Gandhi account గాంధీగారి ఖాతా!
బహుశా.. యావత్ విశ్వంలో.. మహాత్మాగాంధీ అంతటి బ్యాంకింగ్ కస్టమర్ వుండరు
మరణానంతరం కూడా ఆయన ఖాతాలో డబ్బులు జమ అవుతుండడం దీనికి నిదర్శనం.
ఈ ‘గాంధీగారి ఖాతా’ అనే పదం, పదప్రయోగం ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ, విస్తృతంగా వాడుకలో వున్న పదం.
ఎవరికన్నా నాబోటివాడికి అప్పు ఇచ్చినప్పుడో, చేబదులు ఇచ్చినప్పుడో.. ఇక అవి తిరిగిరావని ఖాయం చేసుకున్నాక.. ఆ డబ్బులను గాంధీగారి ఖాతాలోకి లెక్కవేసుకోవడం కద్దు.
జాతిపిత పేరిట ఈ నానుడి రావడం చాలా విచిత్రం.
సొతంత్ర సముపార్జనలో భాగంగా గాంధీగారు ఊరూరూ తిరిగి జోలెపట్టారు. పుట్లింటివాళ్లు, మెట్టినింటోళ్లు ఇచ్చిన గాజులు, చెవి దుద్దులు, మంగళసూత్రాలతో సహా గాంధీగారి జోలెలో వేశారు. ఆడది అర్ధరాత్రి స్వేచ్చగా తిరగగలిగే సొంతంత్రాన్ని కాంక్షించి గాంధీగారి ఖాతాలో జమచేశారు. ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా.
గాంధీగారి ఖాతాలో జమచేసిన వాటికి ప్రతిఫలంగా వాళ్లెవరూ వడ్డీ అడగలేదు, అసలు అడగలేదు. కేవలం దేశానికి స్వతంత్రం అడిగారు. మనుషులకు స్వతంత్రం అడిగారు.
గాంధి పుట్టిన దేశమా ఇది అని అప్పుడప్పుడూ పాటలు వస్తుంటాయి. అది మహాత్మాగాంధీ గురించి కాదు. అనేక గాంధీలు పుట్టిన దేశమేనా అని ఒక వ్యంగ్యం అని అనుకుంటాను.
గాంధీగారి ఖాతా అనేది కూడా.. స్విస్ బ్యాంకుల్లోనూ కనిపించని, వెనక్కు తీసుకురాలేని ఖాతా మొత్తం అనుకుంటాను.
ఇంతకూ మన జాతిపిత జోలె పట్టుకుని సేకరించిన మొత్తానికి జమాఖర్చులేమైనా వున్నాయా? అని డౌటనుమానం.
కొల్లాయికట్టిన జాతిపిత లెక్కలు రాయకుండా వుండరు.
అన్ని వివరాలూ వుంటే కూడా జాతిపిత పేరిట గాంధీగారి ఖాతా అని నవ్వేసుకోవడం జాతిద్రోహం కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి