7, నవంబర్ 2017, మంగళవారం

LPG Gas వంటగ్యాస్‌

LPG Gas వంటగ్యాస్‌ ...

ఇటీవల ప్రకటించినట్లుగానే వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని ప్రకటించినట్లుగానే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగులు ముందుకు సాగుతున్నాయి. పేదల సంక్షేమానికి తిలోదకాలిస్తున్న కేంద్ర సర్కార్.. ఆచరణలో బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలు వాటికి సారథ్యం వహిస్తున్న పారిశ్రామిక యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో అడిగిందే తడువుగా రాయితీలు, పన్ను చెల్లింపుల్లో సబ్సిడీ కల్పిస్తున్నది. ప్రతి నెలా చివరి ఆదివారం 'మన్ కీ బాత్' అనే పేరుతో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తద్వారా ఆయన మనస్సులో ఆలోచన ఆలస్యంగా బయటపడుతున్నది.
ప్రతినెలా గ్యాస్‌ ధర పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఈ పెంపు ఎంత అని తెలిస్తే ముక్కుపై వేలేసుకోవాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత 16 నెలల్లో రాష్ట్ర ప్రజలపై సుమారు రూ.196.41 కోట్ల భారం గ్యాస్‌ వినియోగదారులపై మోపారంటే నమ్మక తప్పదు. గతేడాది ఆగస్టులో సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.567.5 ఉండేది. ఇప్పుడది రూ.808కు చేరింది. ఏతావాతా ఒక సిలిండర్‌పై రూ.240.5 పెరిగింది.
తెలంగాణలో 81.67 లక్షల మందికి సబ్సిడీ
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థల్లో ఇండేన్‌కు 35.28 లక్షలు, భారత్‌ 29.50 లక్షలు, హెచ్‌పీ గ్యాస్‌కు 20.74 లక్షల చొప్పున మొత్తం 85.52 లక్షల గ్యాస్‌ వినియోగదారులున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'గివ్‌ ఇట్‌ అప్‌' పిలుపునకు తెలంగాణలో 3.85 లక్షల మంది సబ్సిడీ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం 81.67 లక్షల మంది సబ్సిడీని పొందుతున్నారు. ఈ లెక్కన బండ భారం సుమారు రూ.196.41 కోట్లకు చేరిందంటే అతిశయోక్తి కాదు. గ్యాస్‌పైన సబ్సిడీని కేంద్రం నెల నెలా తగ్గించుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను తూ.చ. తప్పకుండా పాటిస్తూ నెలనెల ధరలు పెంచుతున్నది. ఈ నెలలో రూ.4.50 పెంచింది. ఈ విధంగా ఏడాదిలోగా సబ్సిడీ గ్యాస్‌ అనే మాట వినపడకుండా ప్రయత్నిస్తున్నది. ఒకేసారి భారం మోపకుండా దశలవారీగా ప్రజలపై బండ బారం వేస్తూనే ఉన్నది.
16 నెలల్లో 19 సార్లు గ్యాస్ ధర పెంపు
సబ్సిడీ ఎత్తి వేయాలనే యోచనతోనే కేంద్రం నెలనెల ఇలా గ్యాస్‌ ధర పెంచుతున్నదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 2016 జూలైలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు ఈ ధరలను 16 నెలల్లో 19 సార్లు సవరించాయి. ఇందులో ఎక్కువ సార్లు పెరుగుదలే ఉండటం గమనార్హం. 2016 ఆగస్టులో రూ.567.5 ఉన్న ధర అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.545.5కి పడిపోయింది. నాటి నుంచి పెరగడమే తప్ప తగ్గలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో రూ.568, నవంబర్‌లో 609, డిసెంబర్‌లో రూ.686కు చేరి ఆ ఏడాది నాలుగు నెలల వ్యవధిలోనే ఒక్కో సిలిండర్‌పై రూ.118.5 భారం వేశారు. ఇక 2017 ఆగస్టులో మినహా ఇప్పటి వరకు తగ్గింపు ఊసేలేదు. ఈ ఏడాది జనవరిలో రూ.687 ఉన్న ధర మార్చి నాటికి రూ.847కు చేరడం ఆందోళన కలిగించే అంశం.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.808
కేవలం మూడు నెలల్లోనే సిలిండర్‌పై ఏకంగా రూ.160 బాదేయడం విశేషం. ఆ తరువాత రెండు మూడు నెలలు పదుల్లో తగ్గించి అక్టోబర్‌, నవంబర్‌ నాటికి వందల్లో పెంచేశారు. ప్రస్తుతం గ్యాస్‌ ధర రూ.808 వసూలు చేస్తున్నారు. కాగా, వంటగ్యాస్‌ను సబ్సిడీపై పొందుతున్నవారిలో సాధారణ కుటుంబాలే ఎక్కువ. ప్రభుత్వం నేరుగా పెట్రోలియం సంస్థలకు సబ్సిడీ సొమ్మును సర్దుబాటు చేసి వినియోగదారులకు తక్కువ ధరకే గతంలో సిలిండర్‌ పంపిణీ చేసేది. సబ్సిడీని పెట్రోలియం సంస్థలకు సర్దుబాటు చేయకుండా వినియోగదారుల నుంచి నిర్ణీత సొమ్ము వసూలు చేసి రీయింబర్స్‌మెంట్‌ రూపంలో కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే విధానం అమలు చేస్తున్నది. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై రూ.90 నుంచి రూ.200 వరకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. అంటే గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం అంతమొత్తాన్ని భరించేది. వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రతినెలా గ్యాస్‌పై రూ.4 చొప్పున ధర పెంచాలని నిర్ణయించింది. ఇలా ప్రతినెలా ధర పెంచుతూ పోయి 2018 మార్చి వరకు మొత్తం సబ్సిడీని ఎత్తేయాలని యోచిస్తోంది. గత నెల సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.714 ఉండగా ఈ నెల నుంచి పెరిగిన ధరతో కలిపి రూ.808కు చేరింది.
వాణిజ్య సిలిండర్ ధర ఒకేసారి రూ.400 పెంపు
సబ్సిడీ సిలిండర్‌ ధరతో పోల్చితే నాన్‌ సబ్సిడీ ధర సుమారు రెండింతలు పెరిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు. గతేడాది ఆగస్టులో సబ్సిడీయేతర సిలిండర్‌ ధర రూ.1,075.5 ఉండేది. ఈ నెల నవంబర్‌లో ఏకంగా 1,464కు చేరింది. గత 16 నెలల కాలంలో అక్షరాల రూ.388.5 పైసలు పెరిగింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో దారుణంగా రూ.1,572.5, రూ.1553.5, రూ.1,553.5 పైసలకు ఎగబాకింది. ఇలా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే దాని ప్రభావాన్ని వ్యాపారులు సామాన్య ప్రజలపై వేస్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల దెబ్బకు విలవిల్లాడుతున్న సామాన్యులు నెలనెల గ్యాస్‌ ధరలు పెంచడంతో కట్టెల పొయ్యే మేలని భావిస్తున్నారు.
ఇలా నెలనెలా ధరలు పెంచుతున్న కేంద్ర చమురు సంస్థలు
మోడీ ప్రభుత్వం 2014 లోక్‌సభ ఎన్నికల ముందు దళిత, బహుజనుల శ్రేయస్సు కోసం పాటుపడతానని ఇచ్చిన వాగ్దానం తుంగలో తొక్కుతున్నదని మండిపడుతున్నారు. ఇప్పటికే నోట్లరద్దు, జీఎస్టీతో పేదల అవసరాలకు ఉపయోగపడే పలు వస్తువులపై అదనపు బాదుడు వేసి కొనుగోలు చేయలేని పరిస్థితి. చమురు కంపెనీలు రోజుకో ధర నిర్ణయిస్తూ వాహనాదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నెలనెల గ్యాస్‌ ధర పెంచడం దారుణమని మోడీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత పెరిగిన నిత్యావసరాల ధరలు
పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని గృహిణులు కోరుతున్నారు. తాము పనిచేసే చోట గ్యాస్‌ ధరలు పెంచినట్టు జీతాలు పెంచడం లేదని చెప్పారు. ఓ వైపు కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి అందనంత ఎత్తులో ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తరువాత ధరలు తగ్గుతాయని గొప్పలు చెప్పన కేంద్రం.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. గతంలో ఏ సర్కార్‌ ఇంత పెంచలేదు. సామాన్యులు వంటగ్యాస్‌ను వదిలేసి కట్టెల పొయ్యిపై వంటచేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడుతున్నారు. కుటుంబానికి అందించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై భారం మోపడం అన్యాయమని అంటున్నారు. సబ్సిడీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం దారుణమని అభిప్రాయ పడుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి