29, జూన్ 2017, గురువారం

Rudrama Devi/రుద్రమదేవి/warangal history.

మా జిల్లా వరంగల్ ఒకప్పటి ఏకశిలా నగరం కాకతీయుల నాటి ఓరుగల్లు మహారాణి రాణి రుద్రమదేవి చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను.

నా చిన్నప్పుడు రాణి రుద్రమదేవి  పుస్తకం ఉండేది అదే పుస్తకం ఆదారం ...

మహారాణి రాణి రుద్రమదేవి చరిత్ర ...

రుద్రమదేవి (ఆంగ్లం : Rudrama Deviకాకతీయుల వంశంలో ఒక ధ్రువతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. ఈమె తండ్రి గణపతిదేవునికి పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేసాడు[2]. గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు ) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ముమ్మడమ్మ. ఈమె మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది. అన్నలదేవుడు సేనాపతి మరియు మహా ప్రధాని.
జీవిత విశేషాలు
కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుని తరువాత 1262 లో రుద్రమదేవి ' రుద్రమహారాజు ' బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్టించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేకమంది సామంతులు తిరుగుబాటు చేసారు. అదేసమయంలో నెల్లూరు పాండ్యుల కింద, వేంగి ప్రాంతం గొంకరాజు మొదటి నరసింహుడి కిందకి వెల్లినయి... పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు తిరుగుబాట్లు చేసారు. రుద్రమ తన సేనానులతో కలిసి ఈ తిరుగుబాట్లనన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. రుద్రమాంబ ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలోకీ దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది, కీలకమైనది. యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు, అయితే రుద్రమ యాదవలను ఓడించి, దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరేదారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి, యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమదేవి యొక్క శైవమత గురువు విశ్వేశ్వర శివశంబు. గణపతి దేవునికి, రెండవ ప్రతాపరుద్రునికి కూడా ఈయనే గురువు. రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
రుద్రమదేవికి గల ఇతర బిరుదులు: రాయగజకేసరి, ఘటోధృతి.
ప్రఖ్యాత పథికుడు మార్కో పోలో ఛైనా దేశమునుండి తిరిగివెళ్ళుతూ దక్షిణభారతదేశము సందర్శించి రుద్రమదేవి గురించి, ఆమె పాలన గురించి బహువిధముల పొగిడాడు. మోటుపల్లి రేవునుండి కాకతీయుల సముద్ర వ్యాపారము గురించి కూడా వివరముగా వ్రాశాడు.
అయితే ఇంకా...కాస్త విపులంగా చెప్పాలంటే ...

రాణీ రుద్రమదేవి గురించి మనకు తెలిసింది

రాణీ రుద్రమ దేవి గురించి మనకు తెలిసినదానికన్నా తెలియనిదే ఎక్కువ. ఆమె జన్మ సంవత్సరం తెలియదు. ఉజ్జాయింపుగా ఊహించడానికి వీలుంది అని కాకతీయ యుగము గ్రంథంలో లక్ష్మీరంజనం రాశారు. నిజమే! రుద్రమదేవి గురించి చరిత్రకారులకూ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.

దిగ్విజయంగా పాలనా

ఆమె తన శక్తిసామర్థ్యాలతో ప్రతి ఒక్కరినీ మెప్పించి దిగ్విజయంగా పాలనా వ్యవహారాలను నిర్వహించారు. ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఓరుగల్లు (నేటి వరంగల్లు) రాజధానిగా పరిపాలించారు. క్రీ.శ.1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మనదేశంలో మహిళాపాలకులు చాలా అరుదు. రాణీ రుద్రమదేవికి కొద్దికాలంముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు. ప్రభువర్గాలకు చెందిన వారు స్త్రీపరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలిగా అంగీకరించక తుదముట్టించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి, ఆమె పరిపాలన, ధైర్యసాహసాలను కొనియాడాడు. ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా, సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు. నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. రజియా సుల్తానా లాగా రుద్రమదేవి కూడా తన తండ్రి పాలనా కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణిచివేసింది. రుద్రమదేవి, ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు.
రాజ్ఞి రుద్రమ దేవిని గూర్చి రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, డాక్టరు నేలటూరు వెంకటరమణయ్య ఇట్లా అభివర్ణించారు. తెలుగు వారిని పాలించిన దేశ పరిపాలకులలో రుద్రమదేవి నిస్సందేహంగా మహాఘనత చెందిన వ్యక్తి. రాజధర్మ విధులను ఆమె నిర్వహించిన తీరువలన తండ్రియామెకు ప్రసాదించిన పురుషనామము.. రుద్రదేవుడు అన్ని విధముల సార్థకమైనది. ప్రజలామెను రుద్రదేవ మహారాజు అని పిలుచుకునేవారు. దేశ పరిపాలనలో ఆమె చైతన్యవంతమైన పాత్ర వహించింది. ధైర్య సాహసములు విక్రమము కల యోధురాలు అవడమే కాక గొప్ప వ్యూహతంత్రజ్ఞురాలు. ఆమె రాజరికం చేసిన కాలంలో తరుచూ యుద్ధముల అలజడి కలిగినా ఆమె ప్రజలు సంతుష్టులు, సంప్రీతులు అయి సుఖించారు

రుద్రమదేవి పాలన ప్రజారంజకమై

రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి సుస్థిరతలతో విరాజిల్లింది. క్రీ. శ. 1000 నుంచి 1323 వరకు దాదాపు మూడు శతాబ్దాల పాటు తెలుగు నేల నేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. కాకతీయ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన తన కూతురు రుద్రమదేవిని కుమారుడిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు ఆమె వయసు పద్నాలుగేళ్లే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటుబిడ్డగా పాలన సాగించింది. రుద్రమదేవి 1261 ప్రాంతం నుంచీ స్వతంత్రంగా పరిపాలించినట్లు కనబడుతుంది. కొన్ని శాసనాల్లో 1279 వరకు పట్టాభిషక్తురాలు కాలేదేమో అనే భావం కలిగించే రాతలున్నాయి.

పాలనాకాలమంతా యుద్ధాలతోనే

రుద్రమ దేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి దాయాదుల నుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురు తిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. పరిపాలనా దక్షతలో నేర్పరి అయిన రాణీ రుద్రమ వారి అసూయను అణిచి వేసింది. దక్షిణాదిని పాలించే చోళులు, మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణీ రుద్రమ. దేవగిరి యాదవ మహాదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పదిరోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్లీ తలెత్తకుండా చేసింది. రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు.

వీరభద్రునితో వివాహం

పద్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదో యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రునితో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ముమ్మడమ్మ, రుయ్యమ్మ. తనకు మగ సంతానం లేకపోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. విధి ప్రాతికూల్యం చేత రుద్రమ దేవి భర్త చాళుక్య వీరభద్రుడు క్రీ.శ. 1266 నాటికే మృతిచెందినట్లు ఆయన తల్లి ఉదయ మహాదేవి పాలకొల్లు శాసనంలో ఉంది. భర్త మరణానికి సమీప కాలంలోనే రుద్రమదేవికి మరొక తీరని దుఃఖం కలిగింది. వృద్ధుడైన గణపతి దేవ చక్రవర్తి 1267లో శివసాయుజ్యం చెంది ఆమెను నిస్సహాయురాల్ని చేశాడు. రుద్రమకు ఇద్దరు కూతుళ్లే కాక మరో కూతురు కూడా ఉందా? అనే అనుమానం ఆ మధ్య ఒక శాసనం కలిగించింది. ప్రకృతశాసనంలోని ఎల్లన దేవుని భార్య కూడా రుద్రమదేవి తనయ అని ఆ శాసనం చెబుతోంది.

రుద్రమదేవి పాలనలో

రాణీ రుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజులూ అర్థం చేసుకోలేదు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ తిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మహామంత్రీ! గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించింది.

గొలుసు కట్టూ చెరువులు

రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు.తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసు కట్టూ చెరువుల విధానం ప్రపంచం మొత్తం తిరిగి చూసిన మరెక్కడ కనిపించని శాస్త్రీయవిధానం రాణి రుద్రమా దేవి చూచించ వ్యవస్ధా విధానం 800 సం||లు దాటినా తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రదాన మూలాదారాం ప్రతి గ్రామానికీ ఊర చెరువులు మరియు కుంటలు లక్నవరంపాకాలరామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు ... వారి పరిపాలనదక్షతకు నిదర్శనం.వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం విస్తరించింది. విరాజిల్లింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు దీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్ప కళ, నృత్యం కలగలిసిపోయి విరాజిల్లాయి.

సువిశాల మహాసామ్రాజ్యాన్ని

మన రుద్రమ అసమాన పరాక్రమశాలి. కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనం. రుద్రమ్మ భుజశక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ స్వప్నమైంది. అంతఃశత్రువులు, బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన చత్తీస్ఘడ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సోం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే రుద్రమ దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారు పేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలనా పటిమను, మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.

ఎప్పుడు చనిపోయింది...

రుద్రమ తన ప్రసిద్ధ సేనాని గోన గన్నారెడ్డితో కలిసి కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో పలు దుర్గాలు వశపరుచుకుంది. గోన గన్నారెడ్డి వారి రాజ్యరక్షామణియైన విఠలనాథ దండనాథుడు మాలువ, హాలువ మొదలైన దుర్గాలు సాధించిన తర్వాత సర్వరాష్ట్ర సమస్త ప్రజారక్షణ కోసం రాయచూరులో దుర్గం నిర్మించినట్లు అతని శాసనం (1294) చెబుతోంది. రాయచూరు విజయం రుద్రమ దేవి కడపటి విజయమని భావిస్తున్నారు. కావున 1295 ప్రాంతమున మహారాజ్ఞి రుద్రమ శివసాయుజ్యం చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన నల్లగొండ జిల్లా చందుపట్ల శాసనంలో రుద్రమదేవి 1289 నవంబరు 27న మరణించినట్లు అవగతమవుతున్నది. దీనిని ఇతర శాసనముల సాక్ష్యముతో సమన్వయించి నిర్ధారించవలసి ఉంది.

అంబదేవుని దొంగదెబ్బ

అనేకసార్లు ఓటమి పాలైన సామంతరాజు అంబదేవుడు రుద్రమదేవిపై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదునుకోసం చూస్తున్న అంబదేవుడికి సమయం కలిసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకి ఎక్కుపెట్టాడు. అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేకపోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేక కపట మాయోపాయం పన్నాడు. ఆ రోజు రాత్రి క్షేత్రానికి సమీపంలో గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్లను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు చేశాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యానికే వన్నెతెచ్చిన వీర ధీరనారి ఆమె. శత్రువుకు ఎదురొడ్డి నిలిచి.. రాజ్యాన్ని పాలించింది. గొప్ప పరిపాలనాధ్యక్షురాలిగా.. కీర్తికెక్కిన మహిళామణి. ఆమే కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా విస్తరింపజేసిన రాణీ రుద్రమదేవి. అయితే రుద్రమదేవి చర్రిత అందరికి తెలిసినప్పటికీ.. ఆమె జీవిత చరమాంకానికి సంబంధించిన విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ వివరాలు తెలియాలంటే నల్లగొండ జిల్లాకు వెళ్ళాల్సిందే.

రాణి రుద్రమదేవి చరిత్ర

కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా స్మరణకు వచ్చే రాణి రుద్రమదేవి చరిత్ర. కాకతీయుల్లోనే రాయగజకేసరి బిరుదాంకితురాలై కీర్తింపబడిన రుద్రమదేవి జీవిత చరమాంకం ఏ విధంగా ముగిసిందో చరిత్రలో ఎక్కడా రాయలేదు. కానీ నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామం రాణీ రుద్రమాదేవి జీవిత చరమాంకానికి సంబంధించిన చారిత్రక అవశేషాలను దాచుకొంది. రాణీ రుద్రమాదేవి ఇదే గ్రామంలో చనిపోయిందని తెలిపే శిలాశాసనాలు చాలాకాలం తర్వాత బయటపడ్డాయి.

రుద్రమదేవి మరణశాసనం

ఉస్మానియా యూనివర్శిటీలో.. తెలుగు రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న సైదులు.. కాకతీయ రుద్రమాదేవి మరణానికి సంబంధించిన చారిత్రిక ఆధారాల కోసం అన్వేషించసాగాడు. ఇందులో భాగంగానే.. చందుపట్ల గ్రామంలో మట్టిలో కూరుకుపోయిన శాసనాన్ని గుర్తించి పురావస్తు శాఖాధికారుల సహాయంతో.. వెలికితీయించి అది రుద్రమదేవి మరణశాసనంగా గుర్తించారు. విరోధనామ సంవత్సరం ద్వాదశి రోజున అంటే.. 1289వ సంవత్సరం, నవంబరు 27వ తేదీన రాణీ రుద్రమదేవి వీరమరణం పొందినట్లుగా శాసనంపై లిఖించినట్లు వెల్లడైందని తేలింది.

అంబదేవుడి రుద్రమ చేతిలో వీరమరణం

నల్లగొండ సమీపంలోని పానగల్లుకు వస్తోన్న క్రమంలోనే చందుపట్ల కాపర్తి అయిన అంబదేవుడి చేతిలో వీరమరణం పొందినట్లు శిలాశాసనం ద్వారా వెల్లడవుతోంది. రాణి రుద్రమతోపాటు.. ఆమె సైన్యాధ్యక్షుడు మల్లిఖార్జున నాయుడు కూడా అక్కడ చనిపోయినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ శాసనాన్ని రాణిరుద్రమ సేవకుడు పువ్వుల ముమ్మడి అనే వ్యక్తి వేయించినట్లు తెలుస్తోంది. ఈ శాసనం బైటపడేవరకు.,. రాణి రుద్రమదేవి మరణించిన తేదీల విషయం ప్రపంచానికి తెలియదు. ఈ శాసనం ఆధారంగా 1289 నవంబరు 27న రుద్రమదేవి చనిపోయినట్లుగా నిర్ధారణ అయ్యింది.

శ్రీశైలం, కాళేశ్వరం, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రీల్లింగ దేశం అదే  పేరు కాలగమనం లో తెలంగాణ అయ్యింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి