16, అక్టోబర్ 2017, సోమవారం

Single country-single party ఒకే దేశం-ఒకే పార్టీ

Single country-single party  ఒకే దేశం-ఒకే పార్టీ ...
నోముల ప్రభాకర్ గౌడ్

పదకొండు మాసాలైంది యాదగిరిని చూసి, ఆయన లోకం ఆయనది. దాదాపు ఏడాది తర్వాత మొన్న వచ్చిండు. పదకొండు నెలల కిందట ఒక శుభరాత్రి ప్రధాని మోదీజీ అలవోకగా టీవీలో కనిపించి నోట్లరద్దు ప్రకటన చేసిన మరునాడు యాదగిరి ఆందోళనాత్మక వదనంతో, కుందల మొందిన డెందంతో, ఎంతో నీరసంతో వచ్చిండు. యాదగిరి సామాన్యుడు, ఈ దేశంలోని కోట్లాది సామాన్యుల్లో ఒకడు. ఆయన ఇంట్లో దాచుకోవడానికి కోట్లు లేవు, తొడుక్కోవడానికి కోట్లు లేవు. రెండు ప్యాంట్లు, రెండు బుషర్టులతో నడుస్తున్న, గడుస్తున్న జీవితం యాదగిరిది.
నలభై ఏండ్ల కిందట, రేపోమాపో ఎమర్జెన్సీ చీకట్లు కమ్ముకోబోతున్న వేళ ఓ తెలుగు వారపత్రిక సంపాదకులం కూర్చొని మాట్లాడుతున్నం. వచ్చేవారం నుంచే చెప్పుకో దగ్గ మనిషి శీర్షిక ప్రారంభించాలనుకున్నం. వారం వారం ఆ కాలం నన్నే రాయమన్నరు. మొదటివారం ఈ దేశంలోని సామాన్యుడు చెప్పుకోదగ్గ మనిషి. 125 వారాలు, ఆ పత్రిక యజమా ని అలిసి పడిపోయేవరకు, పత్రిక వచ్చినంత వరకు ఈ శీర్షిక కొనసాగింది. అప్పటి చెప్పుకోదగ్గ మనుషుల్లో చివరి ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత న్యాయమూర్తి నాగేంద్రసింగ్, షహనాయి షహన్షా ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ప్రఖ్యాత కార్టూనిస్టు అబూ అబ్రహం. నోట్లరద్దు భయంకరంగా దెబ్బకొడుతుందని 11 నెలల కిందట నవంబర్ 9న బాగా అంటే భయపడ్డ, కుంగిపోయిన సామాన్యుడు యాదగి రి మేధావి కాడు, పెద్ద డిగ్రీలు లేవు. అయినా, నోట్ల రద్దు సర్వరోగ నివారిణి. అవినీతిని అంతం చేస్తుంది, నల్లధనం నడ్డి విరుస్తుంది, టెర్రరిజం అంతమవుతుంది, దేశాభివృద్ధి మార్గంలో పయనిస్తుందంటూ రోజూ జోరుగా జరిగిన మల్టీమీడియా ప్రచారం హోరును యాదగిరి వంటి సామాన్యులు ఎంతమాత్రం విశ్వసించలేదు. యాదగిరీ నువు మన్‌కీ బాత్ వింటే ఇంత నిరాశ - నిస్పృహ ఉండేవి కావు అన్నాను. బైంగన్ బాతో, ఆలూ బాతో చేసుకోవడానికే టైమ్ ఉంటలేదు అన్న డు. అవినీతి 16 వేల రెట్లు పెరిగిందని, పెద్ద మనుషులుగా, నయాషాలుగా కనిపించేవారంతా నీతివంతులు కాదని, కశ్మీరు సరిహద్దుల్లో, కశ్మీరు లోయలో, రాజధాని శ్రీనగర్‌లో ప్రజల సంగతి దేవుడికెరుక భారత సైనిక దళాలకే రక్షణ లేదని, చైనా సరిహద్దులో మన మ్యాప్ ఏ క్షణాన, ఏ విధంగా మారుతుందో మనకే తెలియదని (మీరు భూభాగా ల సంగతి మరిచిపోండి, వాణిజ్యం గురించి మాట్లాడుకుందాం. సీబీ ఎం-పరస్పర విశ్వాసాన్ని పెంచే చర్యలు ముఖ్యమనిని చైనా కామ్రేడ్లు మనకు నీతులు బోధిస్తున్నారు!), నూతన రాష్ట్రం తెలంగాణ తప్ప దేశం లో ఇంకే రాష్ట్రం ప్రశాంతంగా అభివృద్ధిపథంలో పయనించడం లేదని గడిచిన మూడేండ్ల చరిత్రను పరికించిన వాళ్లకు అర్థమవుతుంది.
ఎప్పు డూ భుజనా ఓ పాత సంచీ వేల్లాడుతుండే యాదగిరి సామాన్యుడైనా సందేహాలు ఎక్కువ. మన సైనిక బలగాలన్నీ పాకిస్థాన్ ఆక్రమించకుం డా మిగిల్చిన కశ్మీరును రక్షించడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి గదా ఇక అటు చైనాతో, ఇటు పాక్‌తో యుద్ధం వస్తే ఎట్లా అన్నడు. అక్కడి తో ఆగలేదు. మనకంటే చిన్నదేశం పాకిస్థాన్‌కు మనకంటే ఎక్కువ అణ్వాస్ర్తాలు ఉన్నయట ఎట్ల అని అధైర్యపడ్డడు. మాటల తూటాలతో, నినాదాల నిప్పులతో మనం చుట్టూరా ఉన్న శత్రువులందరిని మట్టు పెట్టగలమని ఎంత సముదాయించినా యాదగిరి ధైర్యం పెరుగదు.
130 కోట్లకు మించిన భారత ప్రజలు అదృష్టవంతులు. ఇప్పుడు ప్రధాని మోదీజీ నాటి చాయ్‌వాలా కాడు. ఆయనిప్పుడు గరళ కంఠు డు, నీలకంఠుడు! విమర్శల విషాన్ని ఆయన గళంలో దాచిపెట్టారు. చరి త్ర పుటలను కెళ్లగిస్తే విమర్శల పర్వాలు చాలా కనిపిస్తాయి. గాంధీజీ 1915 జనవరిలో దక్షిణాఫ్రికా నుంచి శాశ్వతంగా తిరిగివచ్చి స్వదేశంలో అడుగుపెట్టగానే పలుదిశల నుంచి విమర్శల దాడిని ఎదుర్కోవలసి వచ్చింది. రెండు పర్యాయాలు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై ఆధ్యాత్మిక రంగంలో మహా మానవుడుగా ప్రసిద్ధి పొందిన పండిత్ మద న్మోహన్ మాలవీయ 1916లో అనిబిసెంట్ సహాయసహకారాలతో వారణాసిలో (యూపీ) బనారసు హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.
ఇప్పుడిది ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. అప్పటి ఇండియా వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ 1916 ఫిబ్రవరి 4న బనారస్ హిం దూ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన జరిపాడు. (నిజాం ప్రభుత్వం ఉదారంగా ఈ విశ్వవిద్యాలయానికి విరాళం ఇచ్చిందన్న వాస్తవాన్ని చెబితే కొందరిని అలర్జీ బాధిస్తుంది) శంకుస్థాపన సందర్భాన నిర్వహించిన ఒక సమావేశానికి దర్భాంగ మహారాజు అధ్యక్షత వహించాడు. ఆ సమావేశంలో గాంధీజీతోపాటు అనిబిసెంట్, భారత సంస్థానాల రాజు లు, మహారాజులెందరో రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్లు పాల్గొన్నారు. గాంధీజీ ప్రసంగిస్తూ రాజులను, మహారాజులను, వారి ఆభరణాలను విమర్శించారు. అనిబిసెంట్‌కు, రాజులకు, మహారాజుల కు కోపం వచ్చి, సమావేశం నుంచి బయటికి వెళ్లారు. గాంధీజీ ప్రసంగంపై విమర్శలు చెలరేగాయి. అప్పటికింకా ఆయన మహాత్ముడు కాలే దు. స్వాతంత్య్ర ఉద్యమంలో, స్వాంతంత్య్రం తర్వాత గాంధీజీ విమర్శలకు గురి కాని రోజు లేదు. విశేషించి మతోన్మాదులు అసహనానికి, తీవ్ర విమర్శలకు ఆయన గురి కావలసి వచ్చింది. 1948 జనవరి 30న మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి గాంధీజీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ చర్చల కారణంగా గాంధీజీ ప్రార్థనా సమావేశానికి ఆలస్యంగా వెళ్లారు. సర్దార్ పటేల్‌కు గాంధీజీతో చర్చలు సంతృప్తి కల్గించలే దు. గాంధీజీ విమర్శలకు గురైన చివరిరోజది. తొలి ప్రధాని జవహర్‌లాల్ ఆయనకు దగ్గరివారు, దూరంవారు అందరూ విమర్శించారు.
ప్రసిద్ధ ఫ్రెంచి సంపాదకుడు టైబర్ మెండెస్ ఒక ఇంటర్వ్యూలో జవహర్‌లాల్‌ను భారతదేశం పరిశ్రమల గురించి అడిగాడు. స్వతంత్ర భారతదేశంలో విమర్శ ప్రధాన పరిశ్రమని నెహ్రూ అన్నారు. విమర్శను గరళంగా భావించి కంఠంలో దాచుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమ నాయకుడు, నిర్విరామ తపస్సుతో, సర్వతోముఖ అపూ ర్వ అభివృద్ధి కృషితో స్వర్ణ తెలంగాణ నిర్మాణం లక్ష్యంగా ఉజ్వల చరిత్ర నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌కు కనీసం అయిదారు కంఠాలైనా ఉండాలె.మహా మానవుడుగా ప్రఖ్యాతి పొందిన మదన్మోహన్ మాలవీయ అభిప్రాయాలతో, దృక్పథంతో ఏకీభవించలేకపోయినా నెహ్రూ వంటి వారు ఆయన సమున్నత వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. ఓ కుంభమేళా సందర్భాన బ్రిటిష్ పోలీసుల ఆంక్షలను ధిక్కరించి మదన్మోహన్ మాలవీయ హఠాత్తుగా దూసుకుపోయి గంగానదిలో దుమికారు. ఆయన వెనుక నిల్చుని పరిస్థితిని గమనిస్తున్న యువనేత నెహ్రూ కూడా వెంటనే నదిలో దూకి అందరికీ ఆశ్చర్యం కలిగించారు. మాలవీయ వెంట జండా లు పట్టుకొని వచ్చి నినాదాలు చేసిన వారెవ్వరూ గంగానదిలో దూకలే దు. మహనీయుడు మాలవీయ నేతృత్వం వహించిన, గోవింద్ వల్లభ్ పంత్ వంటి పరిపాలనాదక్షులు సీఎంలుగా నాయకత్వం వహించిన, పలువురు ప్రధానులను తన ప్రతినిధులుగా ఎన్నుకున్న యూపీ దేశం లో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైనా వెనుకబాటుతనంలో, పేదరికంలో, అజ్ఞానంలో, అభివృద్ధిరాహిత్యంలో ప్రస్తుతం ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నది. 60 ఏండ్ల అణచివేతకు, దోపిడీకి గురై మూడున్నర ఏండ్ల కింద ట ఒక మహా నాయకుని సమరశీలంతో, పోరాటపటిమతో అవతరించిన తెలంగాణ ఆ నాయకుని ముఖ్యమంత్రిత్వంలో అద్భుత ప్రగతితో పురోగమిస్తుండగా యూపీ వెనుకకు దూసుకుపోతున్నది. 6 నెలల కిందట రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి బీజేపీ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన శాసనసభలో రాష్ట్రంలోని 20 శాతం ఓటర్ల వర్గానికి పాలకపక్షం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం విశేషం. విశాల రాష్ట్రంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఈరోజు యూపీలో లేదన్నది మరో విశేషం.
గత ఆరు నెలల్లో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇం కో విశేషం ఆ రాష్ట్రం దర్శనీయ స్థలాల పట్టిక నుంచి ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్‌ను తొలిగించి ఆదిత్యనాథ్ పీఠాధిపత్యంలో ఉన్న గోరఖ్‌పూర్ మఠాన్ని చేర్చడం. ఆరు నెలల నుంచి అమలుజరిగిన గణనీయ అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ లేవు గానీ ఎన్‌కౌంటర్ హత్యలు పెరిగాయి, గోవులను చంపుతున్నారంటూ, గో మాంసం తింటున్నారంటూ మనుష్యలను నిర్దాక్షిణ్యంగా వధిస్తున్నారు, బాబా రాఘవదాస్ మెడికల్ కాలేజీ దవాఖాన వంటి ప్రభుత్వ దవాఖానలలో పసిబిడ్డలు లెక్కలేకుండా మరణిస్తున్నారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఈ రోజు విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణలేదు. శిశుమరణాలు, ప్రసూతి మరణాల రేటు యూపీలో పెరిగినంతగా ఇంకే రాష్ట్రం లో పెరుగడం లేదు. నిరక్షరాస్యత రేటు ఘోరంగా హెచ్చుతున్నది. బడులకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోతున్నది. పిల్లలు బడులకు రాకుంటే తల్లిదండ్రులను చితకబాదాలంటూ యూపీ విద్యామంత్రి హెచ్చరించాడు. యూపీలో మత సామరస్యం దెబ్బతిని సామాజిక అశాంతి తీవ్రస్వరూ పం ధరిస్తున్నది. ఇదిలా ఉంటే ఇటీవల కేరళలో యోగీజీ గురివింద గిం జ పాత్ర నిర్వహించారు. అక్కడి (కేరళ) సీపీఐ(ఎం) కూటమి ప్రభు త్వం హత్యలను నివారించలేకపోతున్నదని, ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నదని యోగీజీ బాధపడ్డారు.
మార్గమధ్యంలో కర్ణాటక రాష్ట్రంలో, పశ్చిమాన మహారాష్ట్రలో ఇటీవల, ఇంతకుముందు జరిగిన మేధావుల హత్యలు ప్రపంచం దృష్టిలో పడ్డాయి. యోగీజీ, ఆ తర్వాత కేరళ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం, ఆయన వెంట వచ్చిన ఓ కేంద్రమంత్రి కర్ణాటక, మహారాష్ట్ర మేధావుల హత్యల గురించి మాట్లాడలేదు. ప్రధాని మోదీజీ కూడా పెదవి విప్పలేదు. హత్యలు ఎక్కడ జరిగినా ఎవ రైనా ఖండించవలసిందే. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇంకో రాష్ట్రం వెళ్లి అక్కడి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనడం, పరుషంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం, ప్రజాస్వామ్య ఔచిత్యమన్నది ముఖ్యప్రశ్న. ఈ దేశంలోని సామాజిక భిన్నత్వం, వైవిధ్యం పట్ల గౌరవం లేనివారు, ఈ దేశంలో తమది తప్ప మరో పార్టీ ఉండటానికి వీల్లేదు, ఒకే దేశం ఒకే పార్టీ అన్న నిగూఢ సిద్ధాంతంతో రాజకీయాలు నడుపుతున్న వారు, పార్టీ కంటే దేశం ముఖ్యమని అంటూనే పార్టీల పోరాటాలు నడుపుతున్న వారు మాత్రమే భారత రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ముఖ్యమంత్రుల కుమ్మలాటకు, తద్వారా రాష్ర్టాల అంతర్యుద్ధ దుష్ట సంప్రదాయానికి ఆజ్యం పోస్తారు. చివరికి నిన్ననే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.), ప్రపంచబ్యాంకు ఆర్థిక నిపుణులు సైతం యాదగిరి వంటి సామాన్యుల ఆందోళనకు అర్థం ఉందని అంగీకరించారు. నోట్లరద్దు, జీఎస్టీ దుష్ట పరిణామాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తున్నదని సూటిగా చెప్పారు. వీళ్లు రెయిన్‌కోట్లు వేసుకొని స్నానం చేసే వాళ్లు కారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి