16, అక్టోబర్ 2017, సోమవారం

Kalesvaram కాళేశ్వరం

Kalesvaram కాళేశ్వరం
నోముల ప్రభాకర్ గౌడ్


కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వ్యవహారంపై ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీచేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ వేసింది. పనుల నిలిపివేతకు సహేతుక కారణాలు చెప్పకుండానే ఎన్జీటీ ధర్మాసనం ఈ నెల 5వ తేదీన ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొంది. ప్రాజెక్టు పనులను నిలిపివేస్తే రోజుకు రూ.100 కోట్ల నష్టంవాటిల్లే అవకాశం ఉన్నదని, కాంట్రాక్టర్లు నష్టపరిహారం అడిగితే మరింత అధికంగా ప్రజాధనం దుర్వినియోగమవుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, నీటిపారుదలశాఖ తరపున కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ బీ హరిరాం వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. ఎన్జీటీ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేయాలని అభ్యర్థించారు. గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు అని, బహుళార్థక ప్రాజెక్టు కోణంలోనే రూపకల్పన చేసినప్పటికీ ప్రస్తుతానికి తాగునీటి కోసం నిర్మాణాలు చేపడుతున్నట్టు తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులూ అవసరం లేదని, అనుమతులు తీసుకున్న తర్వాతే సాగునీటి ప్రాజెక్టుగా తదుపరి నిర్మాణాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును ఆపేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని, అనుమతులు లేవనే కారణంచూపుతూ హై కోర్టులో పిటిషన్లు దాఖలుచేశారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు హయత్‌యుద్దీన్ తప్పుడు వివరాలతో ఎన్జీటీని ఆశ్రయించారని వివరించారు. అటవీప్రాంతంలో ప్రాజెక్టు పనులను చేపట్టడంలేదని, అటవీశాఖ అనుమతులు తీసుకున్నతర్వాతే చేపడుతామని విచారణ సందర్భంగా ఎన్జీటీ ధర్మాసనానికి వివరించినట్టు పేర్కొన్నా రు. ఎన్జీటీ సహేతుక కారణాలు చెప్పకుండా పనుల నిలిపివేతపై జారీచేసిన ఉత్తర్వులు తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం సభ్యుల్లో ఒకరు ఈ నెల 8 వ తేదీన పదవీ విరమణ చేశారని, సమయం లేకపోవడంతో కారణాలను ప్రస్తావించలేదని పేర్కొనడం సమంజసం కాదని వివరించారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ద్వి సభ్య ధర్మాసనం విచారించనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి