Annoma సీతాఫలాలు
సీతాఫలాలతో జ్యూస్, ఐస్‌క్రీం
అధ్యయనానికి మహారాష్ట్ర వెళ్లనున్న ఉద్యానశాఖ అధికారులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శీతాకాలంలో నోరూరించే మధుర ఫలాలు సీతాఫలాలు. పండ్ల రూపంలో రుచిని ఆస్వాదించే సీతాఫలాలను జ్యూస్ (గుజ్జు), ఐస్‌క్రీంగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను రాష్ట్ర ఉద్యానశాఖ పరిశీలిస్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో సీతాఫలాల జ్యూస్, ఐస్‌క్రీంను తయారుచేస్తున్నారు. వీటిని అరబ్ దేశాలకు ఎగుమతిచేసి అక్కడి పరిశ్రమలు లాభాలను ఆర్జిస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు మొత్తం ఐదు నెలలు ఈ పండ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో తోట పంటగా మాత్రం రైతులు సాగుచేయడం లేదు. మహారాష్ట్రలోని పుణెలో సీతాఫలాల జ్యూస్, ఐస్‌క్రీం తయారుచేసే పరిశ్రమలు 36 వరకు ఉన్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన యంత్రాలకు తక్కువ వ్యయం కావడంతో రాష్ట్ర ఉద్యానశాఖ దీనిపై దృష్టిసారించింది. పుణెలో సీతాఫలాల జ్యూస్, ఐస్‌క్రీం తయారీ పరిశ్రమల నిర్వహణను అధ్యయనం చేయాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.
ఈ మేరకు దీపావళి తర్వాత అధికారుల బృందం పుణెకు వెళ్లనున్నట్టు ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామ్‌రెడ్డి నమస్తే తెలంగాణకు తెలిపారు. పుణెలో ఒక్కో పరిశ్రమ ఏడాదికి రూ.8 కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నది. గంటకు మూడు టన్నుల చొప్పున ప్రతి రోజు 16 గంటలపాటు సీతాఫలాల నుంచి గుజ్జును తీసే యంత్రాలు ఉన్నాయి. 50 టన్నుల సీతాఫలాలనుంచి 60 శాతం గుజ్జు లభిస్తున్నది. కేజీ జ్యూస్, ఐస్‌క్రీం ధర రూ.180 వరకు పలుకుతుంది. ఏటా రూ.8.1 కోట్లు ఆదాయం లభిస్తుండగా, వీటిలో రూ.2.25 కోట్ల వరకు జ్యూస్, ఐస్‌క్రీం తయారీ ప్రాసెసింగ్ ఖర్చును కంపెనీలు ఖర్చుచేస్తున్నాయి. దీంతో పరిశ్రమల యజమానులకు ఏటా రూ.4 కోట్ల వరకు లాభాలు వస్తాయని పుణెకు చెందిన ఫ్రాడెన్ ఫుడ్స్ నిర్వాహకులు తెలిపారు. ఇరాన్, ఇరాక్, కువైట్ లాంటి దేశాలకు ఫ్రాడెన్ ఫుడ్స్ వంటి సంస్థలు ఎగుమతి చేస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి