16, అక్టోబర్ 2017, సోమవారం

Singur సింగూరు

Singur సింగూరు.
సింగూరు నుంచి నిజాంసాగర్‌లోకి విడుదలవుతున్న తొమ్మిది టీఎంసీల నీరు
-ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 2.31 లక్షల ఎకరాల్లో పంటల సాగు
-ఫలించిన మంత్రులు పోచారం, హరీశ్ కృషి.. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతుల హర్షం

మెతుకుసీమలో ఇది కొత్త చరిత్ర. సింగూరు, నిజాంసాగర్‌ల కింద రెండు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీరివ్వడం స్వరాష్ట్రం సాధించిన మరో చారిత్రాత్మక విజయం. తెలంగాణ ఆత్మ కలిగిన నేత ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో రుజువుచేసిన గొప్ప పరిణామం. శతాబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడిన అద్భుత సన్నివేశం. బీళ్లు పడిన నేలలు జలకళతో పులకించే శుభతరుణం. ఇది తెలంగాణ అంతా సంబురాలు జరుపుకోవలసిన సందర్భం. ఆత్మగౌరవ ప్రకటనకు ఇది మరో ప్రతీక. మేము మళ్లీ పొలాలు చేసుకుంటమనుకోలేదు. మా భూములు ప్రాజెక్టుల నీళ్లతో తడుస్త్తయనుకోలేదు. మన రాష్ట్రం, మన నాయకత్వం ఉంటే ఏం జరుగుతదో ఇప్పుడు అర్థమైతుంది అని మెదక్ జిల్లా అభ్యుదయ రైతు ఒకరు ఆనందంతో చెప్పారు. నిజమే! వ్యవసాయానికి తొమ్మిది టీఎంసీల విడుదలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయం.. సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద పొలాలకు పునర్జన్మ!!
సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, బాన్సువాడ రూరల్:రెండో పంట, మూడో పంట అన్న పదాలు తెలంగాణ ఎప్పుడూ వినలేదు. ఇక మెదక్, నిజామాబాద్ జిల్లాల సంగతి చెప్పనవసరం లేదు. నాగార్జునసాగర్ ఎడమకాల్వ కింద కొంతకాలం రెండో పంటకు నీరు వచ్చేది. చాలాకాలంగా అక్కడా పొలాలు బీళ్లు పడిపోయాయి. సింగూరు ప్రాజెక్టును జంటనగరాలకు తాగునీరు, మెదక్ జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు నిజాంసాగర్ కింద ఆయకట్టు స్థిరీకరణకు నిర్మించారు. గత మూడు దశాబ్దాల్లో సమైక్య ప్రభుత్వాలు ఒక్క పంటకు కూడా నీరివ్వలేదు. సింగూరు జలాలన్నీ జంటనగరాల తాగునీటికేనన్న పేరుతో మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతాంగానికి అన్యాయం చేస్తూ వచ్చారు. నగరానికి కృష్ణా జలాలు తెచ్చిన తర్వాత కూడా సింగూరు జలాలను మెదక్ ప్రజలకు ఇవ్వలేదు. జంటనగరాలకు కృష్ణానీటిలో కేటాయింపులు చేయించి, తగిననన్ని జలాలను ఎప్పుడో హైదరాబాద్‌కు తరలించాల్సింది. జంటనగరాలకు నీటి కేటాయింపులు చేయించాలన్న సోయే సమైక్య ప్రభుత్వాలకు గానీ, ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన కాంగ్రెస్, టీడీపీ నాయకులకుగానీ లేకపోయింది. మెదక్, నిజామాబాద్ రైతులకు అండగా నిలబడాలన్న ప్రయత్నం ఏరోజూ వారు చేయలేదు. తేలికగా, అందుబాటులో ఉందన్న పేరుతో సింగూరును జంటనగరాలకు అంకితం చేశారు. దీంతో మంజీరా నది పొడవున ఉన్న మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పొలాలు నీళ్లు లేక గొడ్డుపోయాయి. ఐదెకరాలు, పదెకరాలు భూమి ఉన్న రైతులు కూడా పొట్ట చేతబట్టుకుని పట్నాలకు వలసపోవలసిన పరిస్థితి. ఎప్పుడు కరువొచ్చినా మెదక్, నిజామాబాద్ జిల్లాలు విలవిల్లాడేవి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు ఆ దృశ్యం సమూలంగా మారిపోనున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి