ముత్యాల నగరం.. పారిశ్రామికవేత్తలకు వరం
దేశానికి ఎంట్రప్రెన్యూర్‌షిప్ కేంద్రంగా హైదరాబాద్..
అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా ...
అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా ...
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ముత్యాలనగరంగా పేరున్న హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రతీకగా మారబోతున్నదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా పేర్కొన్నారు. నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఒకప్పుడు ముత్యాలకు ప్రసిద్ధి పొందగా.. రానున్న రోజుల్లో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కేంద్రంగా మారనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నవంబర్ 28 నుంచి 30 తేదీల మధ్య జరుగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)పై అమెరికా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఆమె కథనాన్ని రాశారు. ఈ సందర్భంగా నగరానికి చారిత్రకంగా, పారిశ్రామికంగా ఉన్న ప్రత్యేకతలను వివరించారు. రాష్ట్రం సులభ వాణిజ్య విధానంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భాగ్యనగరం అనుకూలమైన ప్రాంతంగా అభివర్ణించారు.
టీహబ్, ఐఎస్బీలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు నెలకొల్పారని చెప్పారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగూల్, యాపిల్, ఉబెర్ వంటి సంస్థలు అతి పెద్దకార్యాలయాలను ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని వివరించారు. భారత్ అమెరికాల మధ్య ైద్వెపాక్షిక సంబంధాలు ఏర్పడి 70 ఏండ్లయిన సందర్భంగా భారత్ సులభవాణిజ్య విధానానికి అనుగుణంగా అనేక మార్పులు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. జీఈఎస్‌లో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం- అందరికి సౌభాగ్యం అనే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా ఎంపిక చేశారని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య పెరుగడానికి, వారిలో అవగాహన పెరుగడానికి, సందేహాలను తీర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.
వెస్టిన్ హోటల్‌లో ఇవాంక బస
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్ నవంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఉంటారు. మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్కులోని వెస్టిన్ హోటల్‌లో ఆమెకు బస ఏర్పాటు చేశారు. అమెరికా అధికారులు ఇప్పటికే హోటల్‌ను పరిశీలించారు. భద్రత, వసతులపరంగా వారు సంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు జరిగే హెచ్‌ఐసీసీకి వెస్టిన్ హోటల్ మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీఈఎస్ 2017 సదస్సుకు హాజరయ్యేందుకు పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవడానికి గడువు సోమవారంతో ముగియనుంది. http://ges2017.gov.in/entrepreneurs.php లో దరఖాస్తు చేసుకోవాలని నీతిఆయోగ్ అధికారులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి