16, అక్టోబర్ 2017, సోమవారం

Krishna కృష్ణ Jurala జూరాల SRSP ఎస్సారెస్పీ Nijansagar నిజాంసాగర్‌

సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు

- ఎగువ నుంచి తగ్గుముఖం పట్టిన వరద
- శ్రీశైలంలో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు
నమస్తే తెలంగాణ: నల్లమల కొండల మధ్య నుంచి కృష్ణమ్మ సాగర్ వైపు పరుగులు పెడుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో నాలుగు రోజులుగా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా ఎగువ నుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగడంతో క్రమంగా గేట్లు ఎత్తి భారీగా నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి శనివారం ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయగా ఆదివారం ఉదయం నుంచి ఇన్‌ఫ్లో తగ్గుతుండటంతో ఒక్కో గేటు మూసి వేస్తున్నారు. ఆదివారం రాత్రి కేవలం రెండు గేట్ల ద్వారా దిగువకు 1,43,565 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో రెండు గేట్ల ద్వారా 55,140 క్యూసెక్కులు, జల విద్యుత్ ద్వారా 74,350 క్యూసెక్కులు, ఎత్తిపోతల ద్వారా 14,075 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,43,565 క్యూసెక్కులు బయటకు వదులుతున్నారు. కాగా ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,26,210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. ప్రస్తుతం 883.90 అడుగుల (209.59 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
జూరాలలో 16 గేట్లు ఎత్తివేత
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జూరాలకు కృష్ణమ్మ తరలివస్తున్నది. ఆదివారం ఉదయం 6 గంటలకు 15గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మధ్యా హ్నం 3 గంటలకు ఇన్‌ఫ్లో 1,21,000 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,09,048 క్యూసెక్కులుగా నమోదైంది. సాయంత్రం 4 గంటలకు మరో గేటు ఎత్తారు. రాత్రి 9 గంటల సమయంలో జూరాలకు ఇన్‌ఫ్లో 1,07,000క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,17,721క్యూసెక్కులు నమోదవుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలకు ప్రస్తుతం నీటి నిల్వ 9.398 టీఎంసీలు ఉంది. ఎగువనున్న ఆల్మట్టిలో 128.19 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 23,830 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 23,830 క్యూసెక్కులు ఉన్నది. నారాయణపూర్‌లో 37.06 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఇన్‌ఫ్లో 36,983 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 42,225 క్యూసెక్కులుగా ఉన్నది.
నిండుతున్న నాగార్జునసాగర్..
నాగార్జునసాగర్:
నాగార్జునసాగర్ డ్యాంలో క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి 547.70 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం గేట్లు, జలవిద్యుత్ కేంద్రాల నుంచి నీరు సాగర్‌కు తరలివస్తున్నది. ఎగువ నుంచి మధ్యాహ్నం వరకు 2,12,288 క్యూసెక్కుల నీరు రాగా రాత్రికి కాస్త తగ్గి 1,84,266గా ఇన్‌ఫ్లో నమోదు కాగా ఔట్‌ఫ్లో 1,650 క్యూసెక్కులు ఉన్నది. సాగర్ రిజర్వాయర్‌లో నీటినిల్వ 204.739 టీఎంసీలకు చేరుకుంది.
మూసీకి 2,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు 2,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 2,664 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటిమట్టం 644.60 అడుగులు (4.36 టీఎంసీలు) ఉంది. డిండి ప్రాజెక్టు నీటిమట్టం 15.5 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు ఉంది.
ఎస్సారెస్పీకి భారీగా వరద
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 46,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఎస్సారెస్పీకి ఇన్‌ఫ్లో వస్తున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1079.90 అడుగులు (51.319) టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద కాల్వకు 7,955 క్యూసెక్కులు, కాకతీయ కాల్వకు 50 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వకు 100 క్యూసెక్కులు, గుత్ప అలీసాగర్ ఎత్తిపోతలకు 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మొత్తం 8,375 క్యూసెక్కులు ఔట్‌ఫ్లోగా నమోదవుతున్నది.
నిజాంసాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 20,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.803 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1396.08 అడుగులు (7.662 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Jurala
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగింది. సోమవారం రాత్రి 2,02,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవటంతో మునుపెన్నడూ లేని విధంగా 31 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఔట్‌ఫ్లో 2,24, 017 క్యూసెక్కులుగా నమోదవుతున్నది. స్పిల్ వే ద్వారా 1,89,994 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి ద్వారా 32వేల క్యూసెక్కులు, కాలువలకు వదులుతున్న నీటిని కలుపుకొని 2,24,017 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలలో 9.480 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగువనున్న ఆల్మట్టిలో 1228.19 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 78,363 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 73,363 క్యూసెక్కులు ఉన్నది. నారాయణపూర్‌లో 35.38 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 83,609 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 99,746 క్యూసెక్కులుగా ఉన్నది.
nagarjunasagar
శ్రీశైలం నుంచి నాలుగు గేట్ల ద్వారా..
అచ్చంపేట, నమస్తే తెలంగాణ : శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు 4 గేట్లను ఎత్తి దిగువన సాగర్‌కు 2,21,572 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 2,76,188 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను సోమవారం సాయంత్రం 884అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 210.032 టీఎంసీలుగా నమోదైంది. కుడిగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 7 యూనిట్ల ద్వారా 27501 క్యూసెక్కుల నీటితో 103 మెగావాట్ల సామర్థ్యం, ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీటితో 150 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగర్‌కు 2,21,572 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే పోతిరెడ్డిపాడుకు 11వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 1013 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకు 1600క్యూసెక్కులు మొత్తం కలిపి 1,66,340 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొసాగుతున్నది.
నాగార్జునసాగర్‌కు జలకళ
నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. సోమవారం సాయ్రంతానికి 552 అడుగులతో 215.540 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి రావడంతో వచ్చే వరదను ఎప్పటికప్పుడు రేడియల్ క్రస్ట్ గేట్లు నుంచి, జలవిద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 2,07,959 క్యూసెక్యుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1650 క్యూసెక్యుల నీరు విడుదలవుతోంది. ఇదిలా ఉండగా మూసీ ప్రాజెక్టుకు రెండు వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. రెండు గేట్ల ద్వారా 2293 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మొత్తం 645 అడుగుల మట్టానికి గాను ప్రస్తుతం 644.50 అడుగుల నీరుంది.
ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో
మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 12,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.31 టీఎంసీలు) కాగా, సోమవారం సాయంత్రానికి 1079.90 అడుగులు 52.010 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాల్వలు, లిఫ్ట్‌లకు 9,285 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు.
నిజాంసాగర్‌లో పెరుగుతున్న నీటి మట్టం
నిజాంసాగర్, నమస్తే తెలంగాణ: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 22,612 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 క్యూసెక్కులు) కాగా, ప్రస్తుతం 1397.82 అడుగులు (9,156 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. కడెం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 1683 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 696.250అడుగులు (6.659టీఎంసీల) వద్ద ఉంది. కుడి కాలువ ద్వారా 17 క్యూసెక్కులను వదులుతున్నారు.
ఎల్లంపల్లి గేట్ల మూసివేత
అంతర్గాం : ఎల్లంపల్లి జలాశయానికి వరద తగ్గటంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం 586 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 19.508 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి