16, అక్టోబర్ 2017, సోమవారం

Kakatiya Mega Textile Park కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌

Kakatiya Mega Textile Park  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌
నోముల ప్రభాకర్ గౌడ్


మరో ఆర్థిక రాజధాని వరంగల్
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు 22న సీఎం శంకుస్థాపన
రూ. 25 కోట్లతో మడికొండ ఐటీపార్కు విస్తరణ
ఔటర్‌రింగ్ రోడ్డుతో మారనున్న దశ దిశ
వరంగల్ పర్యటనలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
డిప్యూటీ సీఎం కడియంతో కలిసి టెక్స్‌టైల్ పార్కు సందర్శన
టెక్స్‌టైల్‌పార్కు లోగో, పైలాన్ ఆవిష్కరణ
మన వస్త్రపరిశ్రమ పోటీ విదేశాలతోనేనని వ్యాఖ్య
వరంగల్ టాస్క్ కేంద్రం ప్రారంభం
స్థానిక విద్యార్థులకు అక్కడే ఉద్యోగావకాశాలు
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి/నిట్‌క్యాంపస్(వరంగల్), నమస్తే తెలంగాణ: వరంగల్ నగరాన్ని తెలంగాణకు మరో ఆర్థిక రాజధానిగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. రాజధాని హైదరాబాద్ తరువాత వరంగల్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించి, అద్భుతమైన పారిశ్రామికవాడగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నదని అన్నారు. శనివారం వరంగల్ పర్యటనలో భాగంగా నిట్ ఆడిటోరియంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్, నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను సందర్శించారు. వరంగల్ అభివృద్ధిపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే వరంగల్ శివారులోని మడికొండ ఐటీపార్కును రూ.25కోట్లతో విస్తరిస్తామని ప్రకటించారు.
వరంగల్ రూరల్ జిల్లాలో ఈ నెల 22న దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కోయంబత్తూరు తరహాలో వరంగల్‌లో టెక్స్‌టైల్ కళాశాలనూ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణంతో వరంగల్ దశ దిశ మారనున్నాయని కేటీఆర్ తెలిపారు. నిట్‌లో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పలు కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకొన్నారు. ఆ తరువాత కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. జీవితంలో ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. వాటిని దీటుగా ఎదుర్కొన్నప్పుడే యువతలోని అసలైన చాలెంజ్ బయటపడుతుంది. ఉద్యోగం రాలేదని, టెన్త్, ఇంటర్‌లో ఫెయిలయ్యామని, ఇంట్లో అమ్మతిట్టిందని, సెల్‌ఫోన్, బండి కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకొంటున్నారు. మానసికంగా బలంగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.
నిట్‌లో, హైదరాబాద్, అమెరికాలోని ఏ కళాశాలలో ఎంత పెద్ద చదువులు చదివినా మానసికంగా దృఢంగా లేకపోతే జీవితంలో రాణించడం కష్టం. నేను ఒక పారిశ్రామికవేత్తను కావాలి, ఒక పరిశ్రమను పెట్టాలి, ఒకటి కనిపెట్టాలి, నా కాళ్లమీద నిలబడి వందమందికి ఉపాధి కల్పించాలంటే ముందుగా మానసిక సంతులనం అవసరం. ఒక్క ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే ఇక జీవితమే అయిపోయిందని ఆగిపోతే కరెక్ట్ కాదు.. టాస్క్ వరంగల్ రీజినల్ సెంటర్.. చదువులు పూర్తిచేసుకుని నిజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు అన్నింటికీ మీరు సిద్ధపడేవిధంగా తీర్చిదిద్దుతుంది అని అన్నారు. మానసికంగా దృఢంగా ఉండటం అంటే ఏమిటో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ను చూసి తెలుసుకోవాలని వేదికపైనే ఉన్న ఆయన్ని చూపుతూ కేటీఆర్ చెప్పారు. 1987లో హైదరాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వసీంఅక్రమ్ లాంటి ఫాస్ట్‌బౌలర్ బౌలింగ్‌లో గాయపడ్డా, తట్టుకొని నిలబడ్డ శ్రీకాంత్ దృఢచిత్తాన్ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వరంగల్ ప్రాంతాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయటంతోపాటు, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, టెక్స్‌టైల్ పార్కు, ఐటీపార్కు ఇవన్నీ అభివృద్ధి పర్చడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌కు వరంగల్‌పై అపారమైన ప్రేమ ఉన్నదని, ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఉపముఖ్యమంత్రి కడియంశ్రీహరి మాట్లాడుతూ, టాస్క్ రీజినల్ సెంటర్ ద్వారా నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ఐటీహబ్ ద్వారా మడికొండలో మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు కూడా వరంగల్‌కు రానున్నాయని దీనిద్వారా ఇక్కడి విద్యార్థులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఇప్పుడున్న ఐటీ పార్కును విస్తరించటంతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఇంకా విస్తరించాలని, అవసరమనుకుంటే కొన్ని నిధులు వెచ్చించి ఐటీటవర్ నిర్మిస్తే ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్‌ను కోరారు.
ఫాం టు ఫ్యాషన్
మెగా టెక్స్‌టైల్ పార్కు ద్వారా 1.20లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని మంత్రి చెప్పారు. ఈ పార్కు రెండో దశకోసం 800ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులకు టెక్స్‌టైల్ పార్కులో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా పునర్వినియోగ పద్ధతిలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఆయన వివరించారు. ఫాం టు ఫ్యాషన్ అన్న ఆలోచనతో టెక్స్‌టైల్‌పార్కును ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. భారతదేశంలో అత్యుత్తమ పత్తి మనదగ్గరే ఉత్పత్తి అవుతున్నదని, 60లక్షల బేళ్లు ఉత్పత్తి అయితే అందులో 10 లక్షల బేళ్లను మాత్రమే మనం వినియోగించుకుంటున్నామని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఇతర రాష్ర్టాల్లో స్థిరపడిన చేనేత కార్మికులతో సమావేశమై వారందరినీ స్వస్థలం తీసుకొస్తామని హామీ ఇచ్చారని, దాంట్లో భాగమే ఈ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. 22న టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన అనంతరం 10నుంచి 12 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతున్నాయని, వారు ఎంత పెట్టుబడి పెట్టబోతున్నారు.. ఎంతమందికి ఉపాధి కల్పించనున్నారు అనేది అదే రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. దక్షిణకొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ (మిస్టర్ సంగ్ నేతృత్వంలో)కూడా అదే రోజు ఎంవోయూపై సంతకం చేయబోతున్నదన్నారు. నిష్ణాతులైన పీఎస్‌జీ కోయంబత్తూరు సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, వారితో ఇక్కడే టెక్స్‌టైల్ కళాశాలను ఏర్పాటు చేయబోతున్నామని కూడా మంత్రి చెప్పారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ద్వారా కేంద్రం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్డుతో ఈ పార్కును అనుసంధానిస్తామని తెలిపారు. టెక్స్‌టైల్ పార్కులోనే కాలనీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ టు వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని, భువనగిరి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, మడికొండ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు నెలకొల్పామని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి