Telangana Palamuru తెలంగాణ పాలమూరు ...Prabhakar Goud Nomula
తెలంగాణ: పాలమూరు జిల్లాకు.. ముఖ్యంగా కల్వకుర్తికి దీపావళి పండుగ నాలుగు రోజుల ముందే వచ్చింది. కరువులు, వలసలు, ఆకలిచావులకు కేరాఫ్‌గా ఉన్న కల్వకుర్తి నీటి గోస తీరుతున్నది. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి ఈ నియోజకవర్గానికి తక్షణం 30 వేల ఎకరాలకు సాగునీరందనున్నది. నాగర్‌కర్నూల్ జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామశివారులో 122 కిలోమీటరు వద్ద కల్వకుర్తి ప్రాజెక్టు నీటిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు.
పాలమూరుకు పట్టిన పీడ విరగడ చేస్తానని, ప్రాజెక్టులు పూర్తిచేసి బీడు పొలాలకు నీళ్లు రప్పిస్తానని అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ శపథం చేశారు. ఆ మేరకు చర్యలు తీసుకొన్నారు. ఆయన ఆదేశాలందిన వెంటనే భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దూకారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఫలితంగా కల్వకుర్తి ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగింది. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి ఆదివారం నుంచి 30 వేల ఎకరాలకు నీళ్లు పారుతాయి. మిగతా పనులు పూర్తయితే మరో 70 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ పొడవు 160 కిలోమీటైర్లెనా ఇదివరకెన్నడూ 85 కిలోమీటర్ల దూరానికి మించి నీళ్లు పారలేదు.
ఇప్పుడు 122 కిలోమీటర్ల దాకా కల్వకుర్తి కాలువల్లో నీళ్లొచ్చాయి. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు తొలిసారిగా ఈ ప్రాజెక్టు నీళ్లను చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు 2014 జూన్ వరకు పదేండ్లలో గత ప్రభుత్వాలు రూ.2716.23 కోట్లు ఖర్చు చేయగా, తెలంగాణ సర్కారు ఈ మూడేండ్లలోనే రూ.1121.17 కోట్లు ఖర్చు చేసింది. ఈ నియోజకవర్గానికి నీరందించడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఆవంచ అక్విడక్టు పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈ రబీ కాలంలో కల్వకుర్తి ప్రాజెక్టు కింద 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కల్వకుర్తి మండలంలో 33 వేలు, ఆమనగల్లు మండలంలో 2800, మాడుగుల మండలంలో 18,700, వెల్దండ మండలంలో 16,600 ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి