15, జులై 2017, శనివారం

Alluri Seetharamaraju/అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు

వికీపీడియా నుండి


అల్లూరి సీతారామ రాజు
అల్లూరి సీతారామ రాజు
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 41897 - మే 71924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

    వంశం

    సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లిఅంతర్వేది పాలెంగుడిమాల లంకదిరుసుమర్రుమౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు -- వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు మరియు అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లాభీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు.[1]
    అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె (ఆమె భర్త దంతులూరి వెంకటరాజు), సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు.
    అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాథ.)

    బాల్యం, చదువు[మూలపాఠ్యాన్ని సవరించు]

    పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు జన్మించిన గృహం
    బాల్యంలో అల్లూరి సీతారామరాజు
    సీతారామరాజు జన్మదినం 1897 జూలై 4. అనగా హేవళంబి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, శుద్ధ పంచమి - 23 ఘడియల 30 విఘడియలు. (సాయంకాల 4 గంటలకు) మఖా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నం.[1] వారి స్వగ్రామం ఇప్పటి పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు అయినా విజయనగరం దగ్గరి పాండ్రంగిలో తాతగారైన (మాతామహుడు) మందలపాటి శ్రీరామరాజు ఇంట రాజు జన్మించాడు. రాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు పుట్టారు.
    రాజు తల్లి సూర్యనారాయణమ్మ సంప్ర్రదాయికముగా చదువు నేర్చుకొన్నది. తండ్రి వెంకటరామరాజు స్కూలు ఫైనల్ వరకు చదివాడు. చిత్రకళలోను, ఫొటోగ్రఫీలోను అభిరుచి కలవాడు. 1902లో రాజు తండ్రి రాజమండ్రిలో స్థిరపడి, ఫోటోగ్రాఫరుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు.
    ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవాడు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.
    1909లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఈ కాలంలో నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1911లో రాజమండ్రిలో ఆరవ తరగతి, 1912లోతూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఏడవ తరగతి ఉత్తీర్ణుడై, 1912లో కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారంలో చేరాడు. ప్రముఖ కాంగ్రెసు నేత మద్దూరి అన్నపూర్ణయ్య అక్కడ ఆయనకు సహాధ్యాయి. తల్లి, తమ్ముడు, చెల్లి తునిలోఉండేవారు. తరువాత వారు పాయకరావుపేటకు నివాసం మార్చారు.
    రామరాజుకు 14 వ ఏట అన్నవరంలో ఉపనయనం జరిగింది. తరువాత తల్లి, తమ్ముడు, చెల్లి తాతగారింటికి, పాండ్రంకి వెళ్ళిపోయారు. తరువాత విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరాడు. అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్లనూ పరీక్ష తప్పాడు. మరుసటి ఏడు నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరాడు. ఆ సమయంలో తల్లి తునిలో నివసిస్తూ ఉండేది. అక్కడ కూడా సరిగా చదివేవాడుకాదు. చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు. పినతండ్రి మందలించడంతో కోపగించి, ఇల్లువదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయాడు. అక్కడే ఐదవ ఫారంలో చేరాడు. మళ్ళీ అదే వ్యవహారం. బడికి వెళ్ళకుండా, తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టాడు. దానితో బడి శాశ్వతంగా మానేసాడు.
    రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. ధారకొండకృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు. వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యంవాస్తు శాస్త్రంహఠయోగంకవిత్వంనేర్చుకున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.
    చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు. దేవాలయాల్లోను, కొండలపైన, శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు. దేవీపూజలు చేసేవాడు. అన్ని కాలాల్లోనూ విడువకుండా శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను శ్రద్ధగా పాటించేవాడు.

    ఉత్తరదేశ యాత్ర[మూలపాఠ్యాన్ని సవరించు]

    1916 ఏప్రిల్ 26 న ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. బెంగాలులో సురేంద్రనాథ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్ళు ఉన్నాడు. తరువాత లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యాడు. కాశీలో కొంతకాలం ఉండి సంస్కృతభాషను అధ్యయనం చేశాడు. ఈ యాత్రలో ఇంకా బరోడాఉజ్జయినిఅమృత్‌సర్హరిద్వార్బదరీనాథ్బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూసాడు. బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు. ఈ యాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా అభ్యసించాడు. గృహవైద్య గ్రంథము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మంత్రపుష్పమాల, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను స్వయంగా వ్రాసుకొని భద్రపరచుకొన్నాడు.
    కృష్ణదేవు పేట చేరుకుని అక్కడికి దగ్గర్లోని ధారకొండపై కొన్నాళ్ళు తపస్సు చేసాడు. కృష్ణదేవుపేట లోని చిటికెల భాస్కరుడు అనే వ్యక్తి, అతని తల్లి ద్వారా రాజు తల్లికి అతని ఆచూకీ తెలిసి,ఆమె రాజు వద్దకు వచ్చింది. 1918 వరకు అందరూ అక్కడే ఉన్నారు.
    రెండవ యాత్ర
    1918లో మళ్ళీ యాత్రకు బయలుదేరి, బస్తర్నాసిక్పూనాబొంబాయిమైసూరు మొదలైన ప్రదేశాలు తిరిగి మళ్ళీ కృష్ణదేవు పేట చేరాడు. కృష్ణదేవిపేట వద్ద తాండవ నదిలో "చిక్కలగడ్డ" కలిసేచోట గ్రామస్థులు కట్టిఇచ్చిన రెండు ఇండ్లలో రాజు, అతని తల్లి, తమ్ముడు, సోదరి, బావ కాపురముండేవారు. దానికి "శ్రీరామ విజయ నగరం" అని పేరు పెట్టారు. రాజుకు తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమె పాదాభివందనం చేసే ఎక్కడికైనా బయలుదేరేవాడు.
    అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవాడు. భక్తి చూపేవారు. 1918 ప్రాంతంలో కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు క్రింద మండల దీక్ష నిర్వహించాడు. ఇతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు భావించేవారు.

    బ్రిటీషు అధికారుల దురాగతాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

    ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది ప్రభుత్వం. గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.
    అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలు
    అల్లూరి సీతారామరాజు చిత్రపటం
    ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆరణాల కూలీ అనిచెప్పి, అణానో, రెండో ఇచ్చేవారు. నిత్యావసరాలను మళ్ళీ అదే ప్రభుత్వపు తాబేదార్ల వద్ద కొనుక్కోవలసి వచ్చేది. కాంట్రాక్టర్లిచ్చే కూలీ వీటికి సరిపోయేదికాదు. ఆకలిమంటలకు తట్టుకోలేక చింత అంబలి తాగే వారు. దాని వలన కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికితోడు, గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించే వారు. అడవుల్లో వారు ప్రయాణం చెయ్యాలంటే, గిరిజనులు ఎత్తుకుని తీసుకువెళ్ళాలి. గిరిజన స్త్రీలపై, వారు అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసారు. వీటినే “పితూరీ” అనేవారు. ఇటువంటిదే లాగరాయి పితూరీ. దీనికి నాయకుడైన వీరయ్యదొరను, ప్రభుత్వం రాజవొమ్మంగి పోలీసు స్టేషనులో బంధించింది.

    మన్యం ప్రజలలో రాజు తెచ్చిన చైతన్యం[మూలపాఠ్యాన్ని సవరించు]

    మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొరగాము మల్లుదొరకంకిపాటి ఎండు పడాలు.
    గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లికి తహసీల్దారు అయిన బాస్టియన్ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుండి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై, కూలీలకు సరైన కూలీ ఇవ్వక, ఎదురు తిరిగిన వారిని కొరడాలతో కొట్టించేవాడు. రామరాజు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసాడు. దానిపై ఏ చర్యా తీసుకోలేదు. అయితే తనపై ఫిర్యాదు చేసాడనే కోపంతో బాస్టియన్ రామరాజు పై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు. రామరాజు గిరిజనులను కూడగట్టి విప్లవం తీసుకువచ్చే సన్నాహాల్లో ఉన్నాడనేది దాని సారాంశం.
    అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి, అతన్ని నర్సీపట్నంలో కొన్నాళ్ళు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ఉంచింది. పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్ళీ 1922 జూన్లోమన్యంలో కాలు పెట్టాడు. విప్లవానికి వేదిక సిద్ధమయింది.

    విప్లవం మొదటిదశ[మూలపాఠ్యాన్ని సవరించు]

    ప్రభుత్వోద్యోగి అయిన ఫజలుల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజలుల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడట. 27-7-1922న తిమ్మాపురంలో ఫజలుల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడట. ఇక విప్లవ మార్గానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. వారించిన తల్లిని క్షేమం కోసం వరసాపురం పంపేశాడు.
    గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణ రాజు (అగ్గిరాజు - భీమవరం తాలూకా కుముదవల్లి గ్రామం), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు (కొయ్యూరు) వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతని అజమాయిషీలో తయారయ్యారట. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి నిశ్చయించుకొన్నారు. ఆగష్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది.
    విప్లవ దళం వివిధపోలీసు స్టేషన్లపై చేసిన దాడుల వివరాలు:

    చింతపల్లి[మూలపాఠ్యాన్ని సవరించు]

    1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని IQ పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి, రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. తిరిగి వెళ్ళేటపుడు, మరో ఇద్దరు పోలీసులు కూడా ఎదురుపడ్డారు. వారి వద్దనున్న ఆయుధాలను కూడా లాక్కున్నారు.

    కృష్ణదేవు పేట[మూలపాఠ్యాన్ని సవరించు]

    ఇనుమడించిన ఉత్సాహంతో మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి, భోజనాలు చేసి ఆ రాత్రే ఆగష్టు 23న - కృష్ణదేవు పేట పోలీసు స్టేషనును ముట్టడించి, ఆయుధాలను తీసుకు వెళ్ళారు. ముందుగా పోలీసులను భయపెట్టి బయటకు పంపేశారు. 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు మాత్రం లభించాయి.

    రాజవొమ్మంగి[మూలపాఠ్యాన్ని సవరించు]

    ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజు - రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.
    వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత పెరిగిపోయింది.

    అడ్డతీగల[మూలపాఠ్యాన్ని సవరించు]

    రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమయింది.

    రంపచోడవరం[మూలపాఠ్యాన్ని సవరించు]

    అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ఠ ఇనుమడించింది. ఇతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్ని సార్లు రాజు తను ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడు.
    ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేవాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారత జాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలేశేవారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు. ఆ తర్వాత రాజు దొరక్

    విప్లవం రెండవదశ[మూలపాఠ్యాన్ని సవరించు]

    డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు.
    ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
    1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)
    క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.
    జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.
    2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.
    సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.

    మరణం[మూలపాఠ్యాన్ని సవరించు]

    17-4-1924న మన్యానికి కలెక్టరు (స్పెషల్ కమిషనర్)గా రూథర్‌ ఫర్డ్ నియమితుడయ్యాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు. విప్లవకారులలో అగ్గిరాజు (అసలు పేరు వేగిరాజు సత్యనారాయణ రాజు. అయితే శత్రువుల గుడారాలకు నిప్పుపెట్టి హడలుకొట్టే సాహసిగనుక "అగ్గిరాజు" అనే పేరు వచ్చింది.) అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. ఆ రాత్రి రాజు మంపగ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు. వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు. తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట.[2]. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేశి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

    ఇతర విప్లవ వీరులు[మూలపాఠ్యాన్ని సవరించు]

    సీతారామరాజు మరణంతో మిగిలిన విప్లవవీరులు ప్రాణాలకు తెగించి విజృంభించారు. వారి దుస్సాహసాల వలన పరిణామాలు విపరీతంగా జరిగాయి. కొందరు పోరాటాలలో మరణించారు. మరికొందరు పట్టుబడ్డారు. ఎండు పడాలును మే 26న గ్రామ ప్రజలు పట్టుకొని చంపివేశారు. సంకోజీ ముక్కనికి 12 సంవత్సరాల శిక్ష విధించారు. గంటదొర భార్యను, కూతురిని బంధించారు. జూన్ 7న "పందుకొంటకొన" వాగువద్ద గంటందొర సహచరులకు, సైనికులకు చాలాసేపు యుద్ధం జరిగింది. చాలా సేపు చెట్టు చాటునుండి తుపాకీ కాల్చిన గంటందొర తూటాలు అయిపోయాక ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అతనిని కాల్చివేశారు. జూన 10వ తేదీన గోకిరి ఎర్రేసును నర్సీపట్నం సమీపంలో పట్టుకొన్నారు. జూన్ 16న బొంకుల మోదిగాడు దొరికిపోయాడు.
    22-8-1922న ఆరంభమైన ఈ మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటివారంలో అంతమైందనవచ్చును. సీతారామరాజు తల్లి 1953 ఆగష్టు 30న, తన 77వ యేట మరణించింది. అతని సోదరి సీతమ్మ భీమవరంలో 1964 జూలై 8న మరణించింది. అతని తమ్ముడు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పదవీవిరమణ చేసి పెద్దాపురం వద్ద బూరుగుపూడిలో నివసించాడు. ఇతని కుమారులు శ్రీరామరాజు, వెంకటసుబ్బరాజు, తిరుపతిరాజు [1][3]

    రాజు గురించి వివిధ అభిప్రాయాలు[మూలపాఠ్యాన్ని సవరించు]

    భారత తపాల శాఖ 1986లోవిడుదల చేసిన అల్లూరి సీతారామ రాజు స్మారక తపాలా బిళ్ల
    • అల్లూరి సీతారామరాజు విప్లవంపై ఆనాటి పత్రికల అభిప్రాయాలు ఇలా ఉండేవి:
      • కాంగ్రెస్ పత్రిక: రంప పితూరీని పూర్తిగా అణచివేస్తే ఆనందిస్తామని ప్రచురించింది.
      • స్వతంత్ర వార పత్రిక (1924 మే 13, 20): అటువంటి (రాజు) వారు చావాలి అని ప్రచురించింది.
      • కృష్ణాపత్రిక: విప్లవకారులను ఎదుర్కోవడం కొరకు ప్రజలకు, పోలీసులకు మరిన్ని ఆయుధాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని విమర్శించింది.
    అయితే రాజు మరణించాక పత్రికలు ఆయనను జాతీయ నాయకుడిగా, శివాజీగా, రాణా ప్రతాప్‌గా, లెనిన్‌గా కీర్తించాయి. రాజు వీర స్వర్గమలంకరించాడని రాసాయి. సత్యాగ్రహి అనే పత్రిక రాజును జార్జి వాషింగ్టన్తో పోల్చింది.
    1929లో మహాత్మా గాంధీ ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు. తరువాతి కాలంలో రాజు గురించి ఆయన ఇలా రాసాడు:
    శ్రీరామరాజువంటి అకుంఠిత సాహసము, త్యాగదీక్ష, ఏకాగ్రత, సచ్చీలము మనమందరము నేర్చుకొనదగినది. సాయుధ పోరాటం పట్ల నాకు సానుకూలత లేదు, నేను దానిని అంగీకరించను. అయితే రాజు వంటి ధైర్యవంతుని, త్యాగశీలుని, సింపుల్ వ్యక్తి, ఉన్నతుని పట్ల నా గౌరవాన్ని వెల్లడించకుండా ఉండలేను. రాజు తిరుగుబాటుదారు కాదు, ఆయనో హీరో. - (యంగ్ ఇండియా పత్రిక - 1926) [4]
    సుభాష్ చంద్ర బోస్-
    సీతారామరాజు జాతీయోద్యమానికి చేసిన సేవను ప్రశంసించే భాగ్యం నాకు కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. .... భారతీయ యువకులు ఇలాంటి వీరులను ఆరాధించడం మరువకుందురు గాక.
    "సీతారామరాజు" బుర్రకథ ముగింపులో ఇలా ఉంది -
    శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది [5]

    ఇవి కూడా చూడండి[మూలపాఠ్యాన్ని సవరించు]

    బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు]

    మూలాలు, వనరులు[మూలపాఠ్యాన్ని సవరించు]

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి