4, జులై 2017, మంగళవారం

Nayeem

నయీం

వికీపీడియా నుండి
Nayeem
నయీం

Naimuddin
జననం.నల్లగొండ జిల్లా భువనగిరి
మరణంఆగష్టు 8 2016
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌
కారణముపోలీస్ ఎన్‌కౌంటర్
అలియాస్భువనగిరి నయీం
కార్యకలాపాలుహత్యలు
సెటిల్మెంట్లు
ఆక్రమణలు
తల్లిదండ్రులుఎండీ నిజాముద్దీన్,అయేషాబేగం
నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం కరుడుగట్టిన నేరస్తుడు మరియు నరహంతకుడు. ఆయన గ్యాంగ్‌స్టర్‌ గా రెండు దశాబ్దాలకు పైగా (1993 - 2016) నేర చరిత్ర ఉంది. ఆయనకు 40 కి పైగా హత్యలు, బెదిరింపులు కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు.

కుటుంబ నేపథ్యం

భువనగిరి పట్టణం బీచ్‌మెుహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండీ నిజాముద్దీన్,అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. ఇందులో నయీం పెద్ద కుమారుడు. తమ్ముడు సలీం, అక్క సలీమాబేగం. నయీం భార్య ఫర్హానా. నయీం పట్టణంలోని బీచ్‌మహలా ఉన్నత పాఠశాలలో చదువుతూ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థిసంఘంలో చురుకుగా పాల్గొనేవాడు. విద్యార్థి దశలోనే రాడికల్‌ భావాలతో పీపుల్స్‌వార్‌లో చేరిన నయీం 1989లో తొలిసారిగా యాదగిరిగుట్టలో పోలీస్‌లపై బాంబు దాడి చేసి అరెస్ట్‌ అయ్యాడు. దీంతో పోలీస్‌లు అతడిని జైలుకు పంపించారు. అక్కడి నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత పార్టీలో వచ్చిన విభేదాలతో లొంగిపోయిన నయీం జైలు జీవితం గడుపుతూనే పోలీసులకు కోవర్టుగా మారాడు.

నక్సలైట్ నుంచి కోవర్టుగా

ఆయన సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సలైట్లను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు, దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామం క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్‌కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని పోలీసులు మట్టుపెట్టారు.

ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం

నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంన్నారు. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు.

దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్

నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో ప్రజాగాయని బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్రెడ్డి… ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి(ఉండేవి).

ఎక్కడా బయటికి రాకుండా

నయీం నేరాలు చేయించే విధానమే వేరు ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోయారు. సైబరాబాద్, హైదరాబాద్లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు.

నయీం ఎన్‌కౌంటర్‌

నయీంను ఎన్‌కౌంటర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌ లోని మిలీనియం టౌన్‌షిప్‍‌లో తలదాచుకున్న నయీంను పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమార్చారు. ఆయన ఉంటున్న ఇంటికి షాద్ నగర్‌కు నయీం వచ్చాడన్న పక్కా సమాచారంతో గ్రే హౌండ్స్ రంగంలోకి దిగింది. 8 ఆగష్టు 2016 సోమవారం ఉదయం నయీం తలదాచుకున్న భవనాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టి అతడిని చంపారు.

భూ దందాలు.. బలవంతపు సెటిల్మెంట్లు

షాద్నగర్లో పోలీసు ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టార్ భువనగిరి నయీం తన నేర సామ్రాజ్యాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభించాడు. జనవరి 27 న 1993 ఉదయం ఆరు గంటలకు ఐపిఎస్ అధికారి కెఎస్ వ్యాస్ ఎల్బిస్టేడియంలో వాకింగ్ చేస్తుండగా కాల్పులు జరిపి చంపిపారిపోయాడు. హైదరాబాద్లో నయీంపై ఆ సమయంలో మొదటి కేసు నమోదు అయ్యింది. ఆ తరువాత 2007లో ఉగ్ర కేసులో నిందితుడిగా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కాడు. పాక్ నుంచి అజ్మీర్ మీదుగా హైదరాబాద్కు ట్రక్కులో ఎకె-47 ఆయుధాలు సరఫరా చేశాడు. ఈ సమాచారం అందుకున్న నగర సిసిఎస్ పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుతో పాటు ముజీబ్అహ్మద్ పట్టుబడ్డాడు. ఎకె-47 ఆయుధా ల తరలింపులో నయీం సూత్రధారి కావడంతో సిసిఎస్ పోలీసులు క్రైమ్ నెంబర్ 786/2007లో నిందితుడిగా పేర్కొన్నారు. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, క్రాంతి సేనపేర్లతో నగరంలో అరాచకాలు సృష్టించాడు. ఈ పేరుతోనే దిలిసుక్ నగర్ పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తంతో పాటు మరికొందరిని హత మార్చాడు. ఆ తరువాత ఎల్బినగర్, ఉప్పల్, హయత్ నగర్, ఫిర్జాదీగూడ, నేరేడ్మెట్, కుషాయిగూడ, శంషాబాద్, పహాడీషరీఫ్, చంద్రాయణగుట్ట, మీర్పేట్ తదితర పోలీసు స్టేషన్లలో బలవంతపు భూ దందా సెటిల్మెంట్లు చేశాడు. ఇక దిలిసుక్ నగర్ ర్లోని తన ఇంటి నుంచి నల్గొండలోని శుభకార్యానికి వెళ్లిన కొనపూరి రాములును కూడా దారుణంగా హత మార్చాడు. ఇక ఎల్బినగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాధాకృష్ణను తన ఇంటి ముందే అతనిపై కాల్పులు జరిపి హత మార్చాడు. నయీం వేధింపులు భరించలేని పలువురు నగర ప్రజలు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్లకు గతంలో ఫిర్యాదు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఫిర్యాదు చేసిన వారిని హత్య చేయడం గాని బెదిరించి ఫిర్యాదులు వాపస్ చేయించుకునేవాడు. తమకు ప్రాణ హాని ఉందని కొనపూరి రాములు, అతని తండ్రి గతంలో ఎల్బినగర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయిన నయిం బారి నుండి రాములు అతని తమ్ముడిని కాపాడలేక పోయారు పోలీసులు, రివల్యూషనరీ పెట్రియాటిక్ టైగర్స్ (ఆర్పిటి) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్దన్రెడ్డిని డిసెంబర్ 28,2011నాడు బొగ్గుల కుంటలో ఆటోలో వెంబడించి దారుణంగా హత మార్చాడు. వ్యాస్ హత్యతో నగరంలో మారుమ్రోగిపోయిన నయీం పేరు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి తో మరోసారి వెలుగులోకి వచ్చింది.

సిబిఐ రెడ్కార్నర్ నోటీసు...

గుజరాత్లో 2005 నవంబర్ 26న రౌడీషీటర్ సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్లో నయీం నిందితుడు. ఇతనిపై సిబిఐ పోలీసులు 2008లోనే రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. సోహ్రాబుద్దీన్, అతని భార్య కౌసర్బీ, అనుచరడు తులసీరామ ప్రజాపతీలు 2005 నవంబర్ 20న హైదరాబాద్ వచ్చారు.జసాంగ్లీ వెళ్లేందుకు నవంబర్ 23న అఫ్జల్ గజ్ నుంచి సంగీత ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న ఈ ముగ్గురిని ఆంధ్ర-కర్నాటక బోర్డర్లోని తదోలా వద్ద గుజరాత్ ఎసిఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగిన మూడు రోజులకే నవంబర్ 26న అహ్మదాబాద్లోని విశాల సర్కిల్ సమీపంలో సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ అయ్యాడు. నవంబర్ 29న కౌసర్బీని హతమార్చి గుజరాత్ ఎటిఎస్ డిజి వంజారా స్వగ్రామైన ఇల్లోల్ గ్రామంలో మృతదేహాన్ని కాల్చేశారు. 2006 జనవరిలో సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ ఎన్కౌంటర్లు బూటకమని సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో డొకంత కదిలింది. బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొన్న ఐదుగురు గుజరాత్ పోలీసు అధికారులను సిబిఐ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. వీరికి సహాయం అందించింది నయీంమని తరువాత తేలింది. నయీం కోసం ఏడేళ్ల నుంచి సిబిఐ గాలిస్తున్నా దొరకలేదు ఈ కేసులోనే ఇతనిపై రెడ్కార్నర్ నోటీసు కూడా జారీ అయ్యింది.

సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్

సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నిందితుడైన నయీంను ఆచూకీ లభించకపోవడంతో సిబిఐ పోలీసులు 2010 మార్చి 24న నయీం బంధువులను, నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం విడిఒ అధికారి ఫహీమ్ను కోఠిలోని సిబిఐ కార్యాలయంలో విచారించి వదిలేశారు. వనస్థలిపురంలో ఉంటున్న ఫహీమ్ అదే రోజు ఇంటికి వచ్చాకా పిల్లాడికి ఫారెక్స్ డబ్బా తెస్తానని షాప్కు వెళ్లి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. సిబిఐ అధికారులు విచారించి వదిలిన గంటకే నయీం దగ్గరి బంధువు ఫహీమ్ అదృశ్యం మిస్టరీ నేటికి వీడలేదు. సొహ్రాబుద్దీన్ తన భార్యతో నగరానికి వచ్చినప్పుడు నయీం వారికి ఆశ్రయం కల్పించిన విషయం ఫహీమ్కు తెలుసని సిబిఐకి తెలిసింది. ఆశ్రయం కల్పించినట్లు కల్పించే గుజరాత్ పోలీసులకు అప్పగించాడని నయీంపై ఆరోపణలు ఉన్నాయి.

అజ్ఞాతంలోకి అనుచరులు…

షాద్నగర్లో నయీం హతమయ్యాడని తెలియగానే నగరంలోని పలు ప్రాంతాలలో ఉన్న అతని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. నయీం సెల్ నెంబర్ ఆధారంగా నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో పోలీసుల వారి వివరాలు రాబట్టారు. ఈ విషయం తెలియగానే ముఖ్యంగా పాతబస్తీలో ఉన్న అతనికి సంబంధించిన కిరాయి హంతక ముఠాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. నల్గొండలో జరిగిన కొనపూరి రాములు, సాంబశివుడి హత్యకేసులో నిందితులు ఇతని అనుచరులే. వీరంతా బెయిల్పై బయటికి వచ్చారు. నయీం సామ్రాజ్యంలో బయటపడిన నిజాలు నయీం ఎదిగిన తీరు… ఆయనకు సహకరించిన వారి వివరాలను చూస్తే ఓ సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నట్టు బయటపడింది. పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతో నయీం చేసిన నేరాల చిట్టాలో.. చీకటి కోణాలు అనేకం వెలుగుచూశాయి. సిట్ విచారణలో ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో నయీంతో సత్సంబంధాలు నెరపిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేయి. నయీం తన స్నేహితులతోనే కాదు.. నమ్మిన బంట్లను, తోడబుట్టిన వారిని కూడా సరిగా నమ్మేవాడు కాదు అన్న నిజం బయటపడింది. తన దగ్గర చేరిన వ్యక్తి నయీం చెల్లెలను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో వారిద్దరినీ హతమార్చిన కిరాతకుడిగా వెలుగుచూశాడు[5]. చిన్ననాటి స్నేహితుడితో మంచిగా ఉంటూనే వారి సంబంధీకుల భూమిపై కన్నేసి భయకంపితులను చేశాడు. చేయడమే కాదు.. వారి ఇంట్లోని ఓ వ్యక్తిని కూడా మట్టుబెట్టాడు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దుర్మార్గుడిగా తేలాడు. ఇక నయీం పుట్టలో నాగుపాముల వంటి వారి చరిత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. వందల మందిని తన అనుచరగణంగా ఏర్పరుచుకున్న నయీం.. ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యతలను అప్పగించేవాడు. భూముల వ్యవహారాలు ఒకరు చూస్తే బెదిరింపులు మరొకరు చూసే వారు . ఆర్ధిక లావాదేవీలు మాత్రం నయీం తన తమ్ముడికే అప్పగించాడు. వేల కొద్ది ఎకరాలను తన పరం చేసుకున్న నయీం… వాటిని తన బంధుగణం, తోడబుట్టిన వారి మీదే కాదు.. అత్యంత సన్నిహితులుగా మెలగిన వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించాడు. నయీం తన మకాం ఒకే చోట కాకుండా పొరుగురాష్ట్రాల్లోనూ విస్తరించుకున్నాడు.

హైదరాబాద్లోనే 20 ఇళ్లను కనుగొన్న సిట్ అధికారులు

కేవలం ఒక్క హైదరాబాద్లోనే 20 ఇళ్లను కనుగొన్న సిట్ అధికారులు.. ఇంకా ఉన్నాయన్న అనుమానాలను వారు అప్పుడు వ్యక్తం చేశారు. అంతేకాదు.. అతను వాటిని డెన్లుగా ఉపయోగించుకుని భూదందాలు, సెటిల్మెంట్లకు కేరాష్ అడ్రస్ గా వాడుకున్నాడన్న వాదనా ఉంది. నయీంకు హైదరాబాద్లోనే కాదు.. గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లులున్నాయని అధికారులు గుర్తించారు. నయీం ఇళ్లలో ఎన్‌కౌంటర్‌ తరువాత బయటపడ్డ ఇళ్ల భూముల పత్రాలను చూసిన అధికారులే విస్తుపోయారు. ఇంకా తోడిన కొద్ది నయీం ఆగడాలు అనంతంగా ఉన్నాయని గుర్తించారు. ఒక్కొక్కటిగా లెక్కతేల్చే పనిలో పడుతూనే… నయీం అనుచరులపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు పట్టుబడిన వారి నుంచి నయీం నెరిపిన దందా, ఆస్తివివరాలతో పాటు డబ్బులను ఎక్కడ దాచి ఉంటాడన్న దానిపై దృష్టి పెట్టారు. బ్యాంకుల్లో కాకుండా నయీం తన దగ్గరనే డబ్బును పెట్టుకునే వాడని తెలుస్తోంది. అలా అయితే బెదిరించి దోచుకున్న వేలకోట్ల డబ్బు ఎక్కడ దాచి ఉంటాడన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. నయీం డైరీలో పోలీసులు, రాజకీయ నేతల పేర్లు కూడా ఉండడంతో వారికి అతనితో ఉన్న డీలింకుల పైన దృష్టి సారించారు. అధికారపార్టీలో ఉన్న నేతల పేర్లు కూడా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. అంతేకాదు… ఇప్పటికే మాజీ మంత్రులు, పేరుమోసిన ప్రజాప్రతినిధులు నయీంతో చేతులు కలిపి భూ దందాలు, సెటిల్మెంట్లకు దిగారన్న వాదనా ఉంది. అయితే కొంతమంది పేర్లు బయట వినిపిస్తున్నప్పటి తమకు నయీంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. బుజాలు తడుముకునే ప్రయత్నం చేశారు. మీడియాలో తమ పేరును వేస్తూ అప్రదిష్టపాలు చేస్తున్నారని ఎదురువాదనకు దిగారు.
ఏకంగా డీజీపీ స్థాయి అధికారులే నయీంతో నేరాలకు దిగారన్న అపవాదు ఉండేది. నక్సలైట్ల ఆచూకీని తెలుసుకునేందుకు నయీం వంటి నల్లత్రాచులను పాలు పోసి పోలీసులు పెంచారన్న దుష్ప్రచారం విస్తృతంగా సాగింది. ఇప్పుడు ఆ నల్లత్రాచే.. కొంతమందికి రివర్స్ అయితే.. మరికొంతమంది జీవితాలను చీకటిమయం చేసేలా చేసింది. పోలీసులు, ప్రజాప్రతినిధుల అండదండలకు తోడు తన దూకుడు తనంతో తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా రెచ్చిపోయిన నయీం.. అనేక మందిని చంపడమే కాదు… కొంతమందిని ఏకంగా మాయం చేశాడు కూడా. ఎన్‌కౌంటర్‌ కు ముందు స్టీల్ సిటీ విశాఖపట్నంపై కూడా కన్నేసిన నయీం అక్కడ కూడా తన దందాలకు తెరతీశాడన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడకి వెళ్లిన ఓ బృందం నయీం ఎక్కడెక్కడ తిరిగాడు.. ఎవరెవరిని కలిసి ఉంటాడన్న దానిపై ఆరా తీశారు.

నయీం ఎంత కిరాతకుడో అంత భయస్తుడు

నయీం ఎంత కిరాతకుడో అంత భయస్తుడు కూడా. అందుకే తన మకాంను ఒకే చోట కాకుండా నిత్యం మార్చేవాడు. అంతేకాదు… చిన్నారులను తన కవచంలా ఉపయోగించుకునేవాడు. స్వతహాగా స్త్రీ లోలుడైన నయీం… మహిళలనే తన గన్మెన్లుగా పెట్టుకునే వాడన్న ప్రచారం ఉంది. బయటకు ఎక్కడికి వెళ్లినా చిన్నారులు, మహిళలు తన వెంట ఉండాల్సిందే. ఎవరైనా చూస్తే ఫ్యామిలీ ( ఓ కుటుంబం ) అన్నట్టుగా ఇతరుల దృష్టి మరల్చేవాడు. ముక్కుపచ్చలారని అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. తన మాట వినని అమ్మాయిల పట్ల క్రూరంగా ప్రవర్తించడమే కాదు.. కాదు కూడదంటే వారిని హతమార్చేవాడు. తన పర భేదం లేకుండా నయీం తన దుర్మార్గాలను కొనసాగించేవాడు. నయీం బాధితులు అనేక మంది ఉన్నారు. విదేశాల్లో కూడా ఉన్నవారున్నారు. సిట్ అధికారులు ఇచ్చిన ధైర్యంతో వాళ్లిచ్చిన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి నయీం అకృత్యాలను వివరించారు. వందల సంఖ్యలో సిట్ అధికారులకు బాధితుల నుంచి ఫోన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నింటిని లెక్కలోకి తీసుకుంటూనే విచారణలో ముందుకు సాగారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలిసింది. ఏకంగా ఓ ప్రజాప్రతినిధి అయితే తనను ఎమ్మెల్సీగా పోటీ చేయొద్దని చేస్తే చంపేస్తానని తన అనుచరులతో నయీం బెదిరించాడని బాహాటంగానే ప్రకటించాడు.

న‌యీం ప‌డ‌క‌గ‌దిలో...

గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం త‌న ప‌డ‌క‌గ‌దిలో ఏం ఉంచుకునేవారు? అవిచూసి పోలీసులు ఎందుకు అవాక్క‌య్యారు? తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. న్యాయ‌స్థానం అనుమ‌తితో న‌యీం ప‌డ‌క‌గ‌దిని తెరిచిన పోలీసులు అక్క‌డ ఉండే వ‌స్తువుల‌ను చూసి అవాక్క‌య్యారు. ఆ గ‌ది ప‌డ‌క గ‌దిలాగా లేద‌ట‌. బంగారు గ‌నిలాగా క‌నిపించింద‌ట‌. 2 గోనె సంచుల నిండా బంగారం.. ఏకే 47, సెనైడ్ గ‌న్‌, 30 విగ్గులు, 5 మేక‌ప్ కిట్లు, 1000 జ‌త‌ల బ‌ట్ట‌లు, వంద‌ల డాక్యుమెంట్లు, ప్రామిస‌రీ నోట్లు, ఒక శాటిలైట్‌ ఫోన్ వంటి ప‌రిక‌రాల‌తో నిండి ఉంద‌ట‌. దీన్ని బ‌ట్టి చూస్తే న‌యీం ఎంత అభ‌ద్ర‌తా భావంతో బ‌తికారో అర్థ‌మ‌వుతోంది. ఎక్క‌డికి బ‌య‌ట‌కు వెళ్లినా ఎవ‌రూ క‌నుక్కోకుండా, పోలీసుల భారి నుంచి త‌ప్పించుకునేంద‌కు విగ్గులు పెట్టుకుని, మేక‌ప్‌లు చేసుకుని వెళ్లేవార‌ని తెలుస్తోంది. కాగా న‌యీం అక్ర‌మంగా, బెదిరించి సంపాదించిన ఆస్థులు త‌వ్వే కొద్ది బ‌య‌ట ప‌డ్డాయి. అప్ప‌టికే వేల కోట్లు బ‌య‌ట ప‌డ‌గా.. ఇంకా బ‌య‌ట‌కు రాని లెక్క‌లు చాలానే ఉన్న‌ట్లు స‌మాచారం.

నయీం డైరీ

గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత అల్కాపురిలోని అతని నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు డైరీలతో పాటు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలం మావోయిస్టుగా పని చేసిన నయీం అక్కడి అలవాటుతోనే తన దినచర్యకు సంబంధించిన అంశాలతో పాటు నగదు లావాదేవీలను డైరీలో పొందుపర్చాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో డైరీ అత్యంత కీలకంగా మారింది. నయీం డైరీ రాయడం అతనితో సంబంధాలు పెట్టుకున్న వారికి వణుకు తెప్పిస్తోంది. ఏ పనిచేసినా నయీం పక్కాగా చేసేవాడన్న ప్రచారం ఎంత ఉందో…అంతే పక్కాగా డైరీని కూడా రాసుకునే వాడు. అలా తాను మాట్లాడిన నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్ నెంబర్లు వారితో సంభాషించిన మాటలు, వీడియోలు అన్నీ తీసి పెట్టుకున్నాడు. ఎప్పుడైనా ఎదురు తిరిగితే తన మార్కు ను చూపాలనే ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడని తెలిసింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో ప్రజాప్రతినిధులు, పోలీసుల పేర్లు ఉండడం, వారితో జరిపిన సత్సంబంధాలు బయట పడటంతో అప్పుడు ఆందోళన రేకెత్తించే అంశమే అయింది. ప్రభుత్వం ఎన్‌కౌంటర్‌ తరువాత మరో పనిచేయాల్సి ఉందన్న వాదనలు మాత్రం గట్టిగా వినిస్తున్నాయి. నయీం పోయినా ఆయన అనుచరులు నాగుపాము లాంటి వారన్న వాదనలున్నాయి. వారిని కూడా అంతమొందిస్తే తప్ప తమకు న్యాయం జరగదన్న అభిప్రాయంలో బాధితులున్నారు. మరి ఆ నాగుపాముల విషయంలో సర్కార్ ఎలా నడుచుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. నయీం ఎన్‌కౌంటర్‌ పైన ఎన్ని ఊహాగానాలున్నా.. ప్రభుత్వం సిట్ను వేసి విచారిస్తుండడంతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. కొందరు సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. ఏదిఏమైనా.. బయటపడిన నేతలు, పోలీసుల పాత్రపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నయీం పుట్టలోని నాగుపాములను(అనుచరులను) ఏరిపారేస్తుందా.. లేదా అన్నది రాజకీయంగా అంత్యంత ప్రాధాన్యతను అప్పుడు సంతరించుకుంది.
1999లో బెల్లి లలితను పదిహేడు ముక్కలుగా ఖండించిన దగ్గరి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాంబశివుని తమ్ముడు రాములును హత్య చేసే దాకా పదిహేడేళ్లు కోవర్టుగానూ, గ్యాంగ్‌స్టర్‌గానూ వ్యవహరించిన నయీముద్దీన్‌కు రాజకీయాల్లో ఏ నాయకునికీ, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ఏ పోలీసు అధికారికీ సంబంధాలు లేవని తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ హైకోర్టులో కౌంటర్‌ ఫైల్‌ చేసింది.
1998లో లొంగిపోయిన నక్సలైట్‌ ఈదన్నను తన వ్యక్తిగత కక్షతో జైలులో ఉండి నయీం చంపించిన తీరుతో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఐబి చాలా అబ్బురపడింది. తన చెల్లెలిని అవమానపరిచాడనే అక్కసుతో నయీం ఈదన్నను నరికి, శిరస్సు వేరు చేసి కనుగుడ్లు తెచ్చి చూపాలని తమ్ముడు అలీముద్దీన్‌కు పని అప్పగించాడు. ఆ పనిచేసి ఆ కనుగుడ్లు పట్టుకొచ్చి జైలులో నయీంకు అతని తమ్ముడు చూపాడు. ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగల నరరూప పాశాన హృదయుడైన ఆ మనిషిని కోవర్టుగా పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు.

కోవర్టు యంత్రాంగాన్ని

కరీంనగర్‌ జిల్లా పీపుల్స్‌వార్‌ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్కాపురం భాస్కర్‌ (విజయ్‌) పాలకుర్తి పక్కన చీటూరు గ్రామానికి చెందిన చంపే పనిని ఆ జిల్లా ఎస్‌పి జడల నాగరాజు అనే దళ సభ్యునికి అప్పగించాడు. ఆ పని పథకం ప్రకారం చేసినందుకు విజయ్‌ తల మీద ఉన్న బహుమతిని డిజిపి ఎచ్‌జె దొర అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి స్వయంగా జడల నాగరాజుకు అప్పగించారు. ఇది ఎలక్ట్రానిక్‌ మీడియాలో కూడా ప్రదర్శింపబడినప్పుడు హత్య చేశానని స్వయంగా ఒప్పుకుంటున్న వ్యక్తికి ప్రభుత్వాలు బహుమానాలు ఇవ్వడం ఏమిటని అప్పటి ఎపిసిఎల్‌సి కార్యదర్శి బాలగోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. హైకోర్టు ఆ పిటిషన్‌ను అసలు విచారించనే లేదు.
ఇటువంటి ప్రయత్నం ప్రభుత్వం అంతకు ముందే కత్తుల సమ్మయ్యతో ప్రారంభించింది. వ్యాస్‌ హత్యకేసులో టాడాకేసులో ఉన్న కత్తుల సమ్మయ్యకు క్షమాభిక్ష పెట్టి అరెస్టు కూడా చేయకుండా తన దళసభ్యులను నిద్రలో చంపివచ్చే కార్యక్రమాన్ని హుజూరాబాద్‌ స్థానిక సిఐ అప్పగించాడు. ఇటువంటివే పావురాలగుట్ట (నల్గొండ)లోను, కరీంనగర్‌ జిల్లాలోను మరికొన్ని కోవర్టు హత్యలు జరిగినవి.
పైన పేర్కొన్న మూడూ ఒకటి రెండు హత్యా నేరాలకు సంబంధించినవే. 1986లో కరీంనగర్‌ జిల్లా ఎస్‌పిగా ఉన్న అశోక్‌ ప్రసాద్‌ మొదలు నయీం ఎన్‌కౌంటర్‌ దాకా పోలీసు అధికార యంత్రాంగం కోవర్టులను పోషిస్తూ వస్తున్నారనడానికి మాత్రమే పై ఉదాహరణలు . 1995-97 మధ్యకాలంలో మెదక్‌ జిల్లా ఎస్‌పిగా పనిచేసిన వి.కె. సింగ్‌ (2016 తెలంగాణ జైళ్ల డిజిపి) ప్రజా ఉద్యమాలను అణచడానికి ప్రజాదర్బార్‌లు, పీపుల్స్‌ కౌన్సిల్‌లు, గ్రామరక్షక దళాలు మొదలుకొని, సిపిఐ (ఎంఎల్‌) ప్రజా పార్టీ వరకు ఏర్పరిచి ఫ్యూడల్‌ కచేరి సంప్రదాయాలను కొనసాగించాడు. ఇవి చట్టవిరుద్ధమని ఎపిసిఎల్‌సి హైకోర్టులో రిట్‌ వేయగా వాటిని రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. న్యాయం కోసం నేను కోర్టులనైనా, చట్టాలనైనా ఎదిరిస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో ఆ తీర్పును సవాల్‌ చేస్తూ మరో రిట్‌ వేసి ఒక ఫ్యూడల్‌ ప్రభువులా చెలామణి అయ్యాడు.
నయీం ఎన్‌కౌంటర్‌ తరువాత అతను కోవర్టు అవునా కాదా అనే చర్చ జరిగినప్పుడు కనీసం ఇద్దరు డిజిపి స్థాయి పోలీసు అధికారులు విప్లవోద్యమాన్ని అణచడానికి ఇటువంటి ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఉపయోగించడం చట్టబద్ధమే అనే పద్ధతిలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. డిజిపిగానూ, వివిధ హోదాల్లోనూ పనిచేసిన దినేశ్‌రెడ్డి స్వయంగా తనకు నయీంపై చర్య తీసుకునే అధికారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పాడు. ఇంక జనాంతికంగా ప్రతి ఒక్క పోలీసు అధికారి నయీంను ఏమీ చేయలేని తమ అసహాయతను ప్రకటించిన వాళ్లే.
ఒక మంత్రి స్వయంగా తెలంగాణ శాసనసభలోనే తన డ్రైవర్‌ను నయీం కిడ్నాప్‌ చేశాడని చెప్పాడు. సిట్‌ విచారణ సందర్భంగా ఐదుగురు మంత్రులు, నలభై ఆరు మంది రాజకీయ నాయకులు, పద్దెనిమిది మంది ఐపిఎస్‌ ఆఫీసర్లు భయానికో, స్వప్రయోజనాలకో నయీం సంబంధాల్లో ఉన్నారని సిట్‌ మీడియాకు లీక్‌లు ఇచ్చిపోయింది.
2000 సంవత్సర ప్రారంభంలో ఒక డిజిపి స్థాయి పోలీసు అధికారికి ఒక మాజీ నక్సలైట్‌ అతని కూతురు పెండ్లిలో విలువైన నెక్లస్‌ కానుకగా ఇచ్చిన దృశ్యం వీడియోలో రావడాన్ని మీడియా ప్రస్తావించినప్పుడు కలకలం రేగింది. నయీం అతని గ్యాంగ్‌కు పోలీసు అధికారులతో ఉన్న ఇటువంటి సంబంధాల గురించి ప్రభుత్వా అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా రాయక తప్పలేదు. అప్పుడు ఒక సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి రంగాచారితో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను వేసింది. కాని తనకు ఏ ఐపిఎస్‌, ఐఎఎస్‌ అధికారి సహకరించడం లేదని కొన్నాళ్లకు ఆయన తనకు తానే కమిషన్‌ను రద్దు చేసుకున్నాడు.
అదే సంవత్సరం ఏడు రాష్ట్రాల్లోని నక్సలైట్‌ ఉద్యమాన్ని అణచడానికి కేంద్ర హోంమంత్రి అద్వాని నాయకత్వంలో ఏర్పడిన ఏడుగురు ముఖ్యమంత్రుల సంయుక్త కార్యచరణ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి  ఒక పత్రం సమర్పించాడు19.30. దాని సారాంశం నక్సలైట్‌ ఉద్యమాన్ని కేవలం చట్టబద్ధంగా పోలీసు యంత్రాంగంతో అణచలేమని, అది శాంతి భద్రతల సమస్య అయినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి కోవర్టు యంత్రాంగాన్ని తయారు చేసుకోవాలని ఆయన ప్రతిపాదించాడు. జర్మనీలో, ఇంగ్లండ్‌లో, ఇజ్రాయిల్‌లో ప్రభుత్వాలు ఇందుకు అనుగుణమైన బలమైన యంత్రాంగాలను తయారు చేసుకున్నాయని ఉదాహరణలు ఇచ్చాడు.
2002 దాకా ఒక డిఐజి స్థాయి ఐపిఎస్‌ ఆఫీసర్‌ లొంగిపోయే నక్సలైట్లందరినీ సమావేశపరిచి, నిర్దేశించే బాధ్యతను నిర్వహించాడు. అతని పేరు అందరికీ తెలుసు. అతను ఈ లొంగిపోయిన నక్సలైట్లందరినీ సమావేశపరిచి వారికి విప్లవకారులను చంపే బాధ్యతలు అప్పగిస్తున్నాడనే విషయం విస్తృత ప్రచారానికి రావడంతో అతన్ని ఢిల్లీ ఎపి భవన్‌కు బదిలీ చేశారు. అతనితో పాటు డిజిపి స్థాయి, అంతకు మించిన స్థాయిలో పనిచేసిన మరో ఇద్దరు ఐపిఎస్‌ ఆఫీసర్లకు పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యులు ముగ్గురు - శ్యాం, మహేశ్‌, మురళి (పశువుల కాపరి లక్ష్మీ రాజంతో పాటు) ఎన్‌కౌంటర్‌ గురించి శౌర్య పతకాలు ఇచ్చినప్పుడు ఆ ముగ్గురూ ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న వాళ్లు కాదని, పైగా ఆ ముగ్గురికీ నయీం కోవర్టు హత్యలతో సంబంధాలు ఉన్నాయని చర్చల సమయంలో హోంమంత్రి దృష్టికి రావడంతో అది వివాదాస్పదమైంది.

హత్యలే హత్యలు

ఎపిసిఎల్‌సి సంయుక్త కార్యదర్శి పురుషోత్తం హత్య సందర్భంగా నయీముద్దీన్‌ స్వయంగా తాను ఆ హత్యలో పాల్గొన్నట్టుగా ప్రకటించాడు. ఎపిసిఎల్‌సి నల్గొండ జిల్లా నాయకుడు ఆజం అలీ హత్య మొదలుకొని 2006లో కనకాచారి హత్య వరకు తెలంగాణ ప్రాంతంలోనే కాదు, ప్రకాశం జిల్లాలో మన్నెం ప్రసాద్‌ హత్య వరకు ప్రజాసంఘాల నాయకులెందరినో తానూ, తన అనుచరులూ చంపినట్లుగా ఆయన ప్రకటనలు చేశాడు. 2002 లో టైగర్‌ల పేరుతోను ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, మఖ్తల్ శాసనసభ సభ్యుడు, 2005, ఆగష్టు 15న నారాయణ పేటలో నక్సలైట్ల పేరుతోను నయీం తూటాలకు బలైన చిట్టెం నర్సిరెడ్డి హత్య తరువాత కోబ్రాల పేరుతోను ఆయన విడుదల చేసిన ప్రకటనలు మీడియా లైబ్రరీలలో వేల కొద్ది దొరుకుతాయి. పోలీసు శాఖలో నయీంకు, నయీం అనుచరులైన మాజీ నక్సలైట్లకు వాళ్ల వాళ్ల హంతక రికార్డులను బట్టి ఐజి మొదలు డిఎస్‌పి స్థాయి వరకు అనధికారికంగా పదవులు గుర్తించబడ్డాయనేది బహిరంగ రహస్యమే.
నయీం ఎన్‌కౌంటర్‌ జరిగినప్పటి నుంచి జరిగిన అరెస్టులు చూస్తే దాదాపు అందరికి అందరు ఆయన గ్యాంగ్‌స్టర్‌ దశలోకి మారినాక చేసిన నేరాలతో సంబంధం ఉన్నవాళ్లుగా భావించబడిన వాళ్లే. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, మహిళలు. వాళ్లనే ఆయన ఎక్కువ విశ్వాసంలోకి తీసుకున్న మాట నిజమే అయినప్పటికీ మిగిలిన వాళ్లంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసమో, భయంతోనో ఆయన ఆస్తులు, డబ్బులు సంపాదించుకోవడానికి సహకరించిన వాళ్లు. ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజాసంఘాల నాయకులను హత్య చేయడంలో నయీంకు సహకరించిన వాళ్లు ఈ అరెస్టయిన వాళ్లలో లేరు.
ప్రజాసంఘాల నాయకుల హత్యల విషయంలో మాత్రమే కాదు, కొందరు పార్టీ నాయకుల ఎన్‌కౌంటర్‌లలో కూడా ఎస్‌ఐబి వాళ్లు నయీంను కోవర్టుగా ఉపయోగించుకున్నారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు సుదర్శన్‌ (కె. సముద్రం), సోమన్న (వరంగల్‌)లను బెంగళూరు నుంచి తీసుకువచ్చి ఎన్‌కౌంటర్‌ చేయడంలో నయీం సహకరించాడు. బెంగళూరులో కేంద్ర కమిటీ నాయకత్వాన్ని అరెస్టు చేయడంలో అదే నల్గొండకు చెందిన నయీం పాత్ర ఉన్నదని స్పష్టమవుతున్నది.
నయీం స్వయంగా నలుగురు పార్టీ నాయకులను, నలుగురు ప్రజాసంఘాల నాయకులను చంపకుండా వదలనని టివి9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పార్టీ నాయకుల్లో ఇప్పుడు ఒకరు మాత్రమే మిగిలారు. ప్రజాసంఘాల నాయకుల్లో పురుషోత్తంను చంపగలిగాడు. మిగిలిన వారిలో ఒకరి విషయంలో నయీం తన ఎన్‌కౌంటర్‌ దాకా బెదిరింపులు, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

పెద్ద యంత్రాంగం

ఇంక బెదిరింపులకు సంబంధించి ఆయన ఎన్‌కౌంటర్‌ సమయం దాకా (ముఖ్యంగా అనుచరులు పీడీ చట్టం కింద అరెస్టయిన సందర్భంగా) కూడా నయీం ఒక మంద్రస్థాయి యుద్ధాన్ని కొనసాగిOచాడు. ఇదంతా ఒక పెద్ద యంత్రాంగం ఉంటే తప్ప సాధ్యమయ్యేది కాదు. అదంతా మాజీ నక్సలైట్లతో ఎస్‌ఐబి సహాయంతో చేసుకున్న నిర్మాణం. నయీం కోరితే అప్పటికప్పుడు తమ ప్రాణాలు ఇవ్వడానికి వెయ్యి మంది ఉంటారని, లేదా ఎవరివైనా సరే ప్రాణాలు తీయడానికి వెయ్యి మంది సిద్ధంగా ఉంటారని భువనగిరి లో ఎవ్వరిని అడిగినా చెపుతారు.
అజ్ఞాతంలో ఉన్న విప్లవ నాయకులతో సహా గంటి ప్రసాదం దాకా కోవర్టు హత్యలు చేయించడంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నయీముద్దీన్‌ కోవర్టు నాయకత్వాన్ని వాడుకున్నది. గుజరాత్‌లో సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌, మాజీ హోంమంత్రి హిరేన్‌ పాండే హత్యలతో నయీంకు ఉన్న అంతకన్నా మించి గ్యాంగ్‌స్టర్‌గా నయీం ముఠా చేసిన దుర్మార్గాలు, దురాక్రమణలు అన్నీ రాజకీయాల్లో, పోలీసు యంత్రాంగంలో స్వార్థ ప్రయోజనాలు పొందిన వాళ్లకు చాలా అవసరమైనవి. కోవర్టుగా చేసిన పనులన్ని దోపిడీ వర్గానికీ, రాజ్యానికీ అవసరమైనవి. కనుక హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చేదు నిజం అది.

శేఖర్ రెడ్డి వల్లే

నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వల్లే నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చెయ్యాల్సి వచ్చింది. తన కార్యకలాపాలకు అడ్డురావద్దని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని నయీంతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా హెచ్చరించారని.. అందుకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆ ఎమ్మెల్యే చివరకు రాజీనామా లేఖతో కేసీఆర్ వద్దకు వెళ్లాడు. దీనిపై సీరియస్ అయిన కేసీఆర్ వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి.. నయీం మీద చర్యలు తీసుకోవాలని అనధికార ఆదేశాలు జారీ చేశారట. అలా కేసీఆర్ బలంతో నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.



https://www.youtube.com/watch?v=zSKRAeKA5jk
 https://www.youtube.com/watch?v=c6iDM_e2y3I


నోముల ప్రభాకర్ గౌడ్                  
                                                                  Prabhakargoud Nomula

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి